రాజధాని పేరుతో చంద్రబాబు ముంచేశాడు | YS Jagan Addresses At Public Meeting In Undavalli | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో చంద్రబాబు ముంచేశాడు

Published Wed, Apr 11 2018 6:47 PM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

YS Jagan Addresses At Public Meeting In Undavalli - Sakshi

సాక్షి, ఉండవల్లి: పక్కనే కృష్ణానది.. ఏటా నాలుగు పంటలు పండే సారవంతమైన భూమి.. దగ్గర్లో విజయవాడ నగరం.. ఇన్ని ప్రత్యేకతలున్న ఉండవల్లిలో ఎకరం భూమి కనీసం ఐదు కోట్ల రూపాయలు పలుకుతుంది. కానీ రాజధాని పేరుతో పచ్చచొక్కాల గద్దలు ఇక్కడి రైతులను దారుణంగా మోసం చేశాయి. ఆ గద్దల గుంపునకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ ముంచేశాడు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. 134వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

రైతులు చెబుతున్నది ఇదే.. : మంగళగిరి రాజధాని ప్రాంతంలో అడుగులు వేస్తున్నప్పుడు ప్రజలు నాదగ్గరికొచ్చి బాధలు చెబుతుంటే గుండె తరుక్కుపోయింది. ‘‘  అన్నా.. బలవంతంగా మా భూములు లాక్కున్నారని రైతులు చెబుతున్నారు. అసైన్డ్‌ భూములు కోల్పోయామని పేదలు విన్నవించారు. ఇక లంక భూముల వ్యవహారమైతే దగా కంటే దారుణం. మొదట్లో లంక భూములకు ప్యాకేజీ రాదని ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. రైతుల దగ్గర్నుంచి చవకగా భూములు కొట్టేశారు. ఆ తర్వాత ఆ భూములకూ ప్యాకేజీ రావడంతో పేదలు వాపోయారు. రాజధానికి భూములిచ్చిన కుటుంబాల్లో అందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చంద్రబాబు చెప్పాడు. ఇవాళ పిల్లలు కాలేజీలకు వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేని పరిస్థితి. అందరికీ ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, వృద్ధాశ్రమాలు, వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. వీటిలో ఏఒక్కటి చేయకుండా చివరికి మమ్మల్ని నాశనం చేసి వదిలేశాడని రాజధాని ప్రాంతవాసులు అంటున్నారు. ఒక ఎకరం కనీసం రూ.5 కోట్లు పలుకుతుంటే.. ప్రభుత్వం మాత్రం వెయ్యి గజాల స్థలం ఇస్తామంటున్నదని జనం బాధపడుతున్నారు.

‘అయ్యా, రోడ్లు వేసి వదిలిపెడితే ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమేదో మేము చేసుకోలేమా, నేరుగా మేమే బాగుపడతాం కదా’ అని రైతులు చెబుతున్నారు. ముగ్గురం కలిసి కూలికి పోతే నెలకు కనీసం 20 వేలు సంపాదించేవాళ్లం.. ఇప్పుడు పంటలులేక ఉపాధిపోయిందని రైతు కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉండవల్లికి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంది. అయినాసరే చుట్టుపక్కల ఇసుక రీచ్‌ల నుంచి లక్షల టన్నులు అక్రమ రవాణా అవుతోంది. ‘అసలు ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజల ఆస్తులు కాపాడేవాడా, దోచుకునేవాడా? ఇసుకమాఫియా డాన్‌ ఎవరన్నా?’ అని యువతరం ప్రశ్నిస్తోంది. అధికారుల నుంచి చినబాబు దాకా అక్కడి నుంచి పెదబాబు దాకా అంతా అవినీతిమయం. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం ఆనంద నగరాలు పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. కన్సల్టెన్సీలకు కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఒక కార్పొరేటర్‌కు ఉన్న జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదు. పక్కనే కృష్ణా నది ఉన్నా మంగళగిరికి తాగునీళ్లు లేవు. నోరు తెరిస్తే స్మార్ట్‌ సిటీ అంటాడు లేదా క్యాపిటల్‌ సిటీ అంటాడు... కానీ నాలుగేళ్లలో కనీసం డ్రైనేజీ కూడా కట్టలేదు. ఇదీ బాబుగారి హైటెక్‌ పాలన’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

రాష్ట్రం వైపు ఒక్కసారి చూడండి..
నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు.. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్నాయి.. మీరంతా గుండెలపై చేయివేసుకుని ఆలోచించండి..
మోసాలు చేసేవాడు నాయకుడిగా కావాలా? అబద్ధాలు చెప్పేవాడు నాయకుడిగా కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలన గమనించండి
ఎన్నికలప్పుడు రుణమాఫీలని రైతులను, పొదుపు సంఘాలను, చదువుకునే పిల్లలలను, జాబుల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు.
విశాఖలో సమ్మిట్‌ పెడతాడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతాడు.. ఒక్క ఉద్యోగమైనా కనిపించిందా
నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదన్నాడు. మధ్యలో ప్యాకేజీ బాగుందన్నాడు. మళ్లీ ఇవాళ హోదా అంటున్నాడు. చంద్రబాబు చేసిన మోసాల్లో అన్నింటికన్నా దారుణమైన మోసం హోదాపై యూటర్నే.
ఇవాళ హోదా ఎండమావిగా మారడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబే.
కేంద్రాన్ని మేల్కొల్పాలనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే, నరేంద్ర మోదీ దిగొచ్చి హోదా ఇచ్చేదికాదా
నాలుగేళ్ల పాలన చూశారు. పొరపాటున చంద్రబాబును క్షమిస్తే మోసాలకు అంతమే ఉండదు.
జనం నమ్మరుకాబట్టే ఆయన కొత్త మాటలతో ముందుకొస్తాడు.. ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజ్‌ కారు ఇస్తానంటాడు. అయినా నమ్మరని తెలుసుకాబట్టి ప్రతి ఇంటికీ మనిషిని పంపించి చేతిలో మూడు వేలు పెడతాడు. ఆ డబ్బు మన దగ్గర్నుంచి దోచేసిందేకాబట్టి మూడుకు ఐదు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వెయ్యండి.
అబద్ధాలు, మోసాలు చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తేనే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది.

రాబోయే మన ప్రభుత్వంలో
ప్రజల ఆశీర్వాదంతో రేపు ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో నవరత్నాల్లాంటి పథకాలను అమలుచేసుకుందాం. నవరత్నాల నుంచి పిల్లల చదువులకు సంబంధించిన అంశాలను చెబుతాను.
పిల్లల చదువుల కారణంగా కుటుంబాలు అప్పులపాలు కావద్దని మహానేత వైఎస్సార్‌ భావించేవారు. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు.
ఆ పథకం ఇప్పుడు దారుణంగా నీరుకారింది. ఫీజులు లక్షలల్లో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం 30 వేలు మాత్రమే. మిగతా డబ్బులు చెల్లించలేని స్థితిలో చాలా మంది చదువులు మానేస్తున్నారు.
నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ తండ్రి ఫీజులు కట్టలేని స్థితిలో కొడుకు ఆత్మహత్య చేసుకున్న వైనం నన్ను తీవ్రంగా కలిచివేసింది.
రాజన్న కుమారుడిగా ప్రజలకు మంచి చేసే విషయంలో ఆయన కంటే నేను రెండడుగులు ముందుకు వేస్తానని మాటిస్తున్నా.
పిల్లను ఏం చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. హాస్టల్‌, మెస్‌ ఖర్చులకు అదనంగా సంవత్సరానికి 20 వేల రూయాలు ఇస్తాం.
మన పిల్లలు బాగా చదవాలంటే.. బాల్యం నుంచే పునాదులు పడాలి. అందుకే పిల్లల్ని పంపించే తల్లులకు సంవత్సరానికి 15 వేల రూపాయాలు అందిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement