
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ భవన్‌లో జరిగిన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, ప్రత్యేక హోదాపై ఉభయసభల్లో అవలంభించాల్సిన విధానంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో నాలుగవ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్ సీపీ ఉంది. దీన్ని ఒక అవకాశంగా భావించాలి. మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఫలితాలు రాబట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీల గౌరవం పెరిగేలా, హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కువ శాతం యువకులు, విద్యావంతులు ఉండటం వల్ల భాషాపరమైన సమస్య ఉండదు. శాఖలవారీగా ఎంపీలు ఏర్పరచుకొని ఆయా శాఖాల నుంచి రావాల్సిన నిధులపై కృషి చేయాలి. వ్యక్తిగత ఆసక్తి, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ఎంపిక చేసుకోవాలి. పార్లమెంట్ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా మిథున్ రెడ్డి సలహాలు, సూచనలతో సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఎంపీలను సబ్ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తాం. తరచుగా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను దృష్టి సారించాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో పార్లమెంట్‌లో వ్యవహరించాలి.’ అని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామి...వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుమారస్వామిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
ఇక మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో 115 ఏస్పిరేషనల్ జిల్లాలపై చర్చ జరగనుంది. నీటి ఎద్దడి, తాగునీటి సమస్య నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment