మా మీదే దాడి చేసి మాపైనే కేసులు : వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets Governor Narasimhan To Complaints Oven Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మా మీదే దాడి చేసి మాపైనే కేసులు : వైఎస్‌ జగన్‌

Published Tue, Apr 16 2019 12:53 PM | Last Updated on Tue, Apr 16 2019 5:27 PM

YS Jagan Meets Governor Narasimhan To Complaints Oven Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దొంగకేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నా పోలీసులు ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును అవహేళన చేస్తు మాట్లాడుతున్నారని ఆరోపించారు.మంగళవారం ఆయన, వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఆదిములపు సురేష్‌, గోవర్ధన్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మెదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, కారుమురి నాగేశ్వరరావు, శ్రీకాంత్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్‌, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, ఎస్వీ మోహన్‌ రెడ్డిలతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజు, ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన దాడులను గవర్నర్ దృష్టికి తెచ్చామని చెప్పారు. ‘ గవర్నర్‌ గారిని కలవడం జరిగింది. నిన్న మా పార్టీ బృందం డిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి శాంతిభద్రల మీద ఫిర్యాదు చేసింది. మళ్లీ అవే అంశాల మీద గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఏ విధంగా దాడులు జరిగాయి. ఏరకంగా తనకు సంబంధిన వ్యక్తులను పోలీసులు డిపార్టుమెంట్‌లో పెట్టుకొని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారో గవర్నర్‌కు వివరించాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

ఎందుకు కేసు పెట్టలేదు
సత్తెనపల్లి నియజకవర్గం ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి డోర్‌ను లాక్‌ చేసుకున్నారు. ఇది రికార్డులో ఉంది. ఓ పార్టీ అభ్యర్థి అలా చేయడం కరెక్టేనా? అక్కడ పోలింగ్‌ అధికారులు లేరా? డోర్‌ వేసుకొని తనంతట తాను చొక్కాలు చించుకొని రాద్ధాంతం చేయడం కరెక్టేనా? ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు. గురజాలలో ఎస్సీ, ముస్లింలు ఓటేయలేదని కొట్టారు.. అయినా ఎందుకు కేసు పెట్టలేదు. ఎమ్మెల్యే శ్రీవాణిని ఏకంగా రూమ్‌లో బంధించి, టీడీపీ కార్యకర్తలు దాడి చేసినా ఎందుకు వారిపై కేసు పెట్టలేదు. పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబును పోలింగ్‌ రోజు టీడీపీ నేతలు కొడితే కుట్లు పడ్డాయి. ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఎందుకు కేసు పెట్టలేదు? చంద్రబాబు యధేచ్ఛగా తన కులానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. వారు టీడీపీ తొత్తులుగా మారి ఇష్టం వచ్చినట్లు పనిచేస్తున్నారు. అన్యాయంగా కొడుతూ బాధితులపైనే కేసులు పెడుతున్నారు. అందరూ కలిసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారు. 

బినామీలకు విచ్చల విడిగా చెక్కులు ఇస్తున్నారు
మచిలీపట్నంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల తలుపు తీసి ఈవీఎంలను బయటకు తీశారు. ఇవన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను పూర్తిగా కేంద్రం కంట్రోల్‌లోకి తీసుకెళ్లాలి. పారా మిలటరీ ఫోర్స్‌ దించాలి. రాష్ట్ర పోలీసులను పక్కకు పెట్టాలి. వెబ్ లైవ్ సీఈఓ ఆఫీస్లో మానిటర్ చెయ్యాలని గవర్నర్‌ను కోరాం. చంద్రబాబు అవినీతి ఆధారాలు మటుమాయం చేసే పని సెక్రటేరియట్లో జరుగుతోంది. తనకు సంబంధించిన బినామీలకు విచ్చలవిడిగా చెక్కులు ఇస్తున్నారు. డబ్బులు రిలీస్‌ చేయకుండా సీఎస్‌ను ఆదేశించాలని గవర్నర్‌ కోరాం. 

అప్పుడు ఈవీఎంల మీద అనుమానం రాలేదా?
రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా దాదాపు 80 శాతం పోలింగ్‌ జరిగింది. 80 శాతం జనాభా వెళ్లి పోలింగ్‌ బూత్‌కి వెళ్లి ఓటు వేశారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్‌లో చూసుకొని సంతృప్తిగా బయటకు వచ్చారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఫ్యాన్ కి వేసినా.. సైకిల్కి పడితే ఊరుకొను కదా?  అలా అయితే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు?  ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు. ఆయన సినిమాలో విలన్‌ లాగా డ్రామాలు చేస్తున్నారు. పోలింగ్‌ మొదలయ్యే ముందు ప్రతి బూత్‌లోనూ అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ కూర్చుంటూరు. మాక్‌పోలింగ్‌ చేస్తారు. వాళ్లు నొక్కిన గుర్తు పడితేనే పోలింగ్‌ ఏజెంట్లు సంతకాలు పెడతారు. ఈవీఎంలు పనిచేస్తున్నాయని సంతకాలు  తీసుకున్న  తర్వాతనే ఓటింగ్‌ జరుగుతుంది. టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లు ఒప్పుకున్న తర్వాతే పోలింగ్‌ మొదలయ్యాయి.

 ఇప్పుడు చంద్రబాబు నేను ఎవరికి వేశానో.. నాకే తెలవది అంటున్నారు. ఇది సీఎంస్థాయి వ్యక్తి చేసే పనియేనా? ఇదే పెద్దమనిషి చంద్రబాబు 2014లో గెలిచింది ఈవీఎంలతోనే కాదా? అప్పుడు ఏ పార్టీకి ఓటు వేశారో కూడా తెలియదు. వీవీప్యాట్‌లు లేవు. అప్పుడు మేం ఏం అనలేదు. నంధ్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అన్ని బాగున్నాయి కానీ ఇప్పుడు ఈవీఎంలు పనిచేయడం లేదు అంటారు. ఇదే ఈవీఎంలతో మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌‌, కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచింది. బీజేపీ ఓడిపోయింది. అప్పుడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ప్రజల తీర్పు అవహేళన చేస్తు మాట్లాడడం సిగ్గు చేటు. చంద్రబాబు బుద్ది ఇదే. గెలిస్తే సింధుకు నేనే ఆమెకు బాడ్మీంటన్‌  నేర్పించా అంటారు. బిల్‌గేట్స్‌కు నేనే కంప్యూటర్‌ నెర్పించా అంటారు. ఓడితే సింధు కోచ్‌ది తప్పు, బిల్‌ గేట్స్‌ కంప్యూటర్‌ బటన్‌ సరిగా నొక్కలేదని అంటారు. చంద్రబాబు పాలనపై ప్రజలకు విసుగెత్తి బైబై బాబు అన్నారు.తన మోసపూరిత పాలన బయటపడొద్దని ఈవీఎంల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు’  అని జగన్‌ ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement