సాక్షి, ఓర్వకల్లు : ‘ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకూ రాష్ట్రంలో ప్రజల కష్టాలు స్వయంగా చూశాను. మీ బాధలు, సమస్యలు విన్నాను. పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నా. నాలుగైదు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తా. మీ అందరికీ చెబుతున్నా... నేనున్నానే భరోసా ఇస్తున్నా.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు బహిరంగ సభలో ప్రసంగించారు.
పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలు తిరిగాను. ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ల కష్టాలేంటనేది చూశాను. మీ మాటలు విన్నాను. నేనున్నాను అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో నాలుగైదు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా, సగటు మనిషి, కుటుంబం ఏం కోరుకుంటుందని, ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకూ వెతికాను. మనిషికి మనసు ఉంటే ఎదుటవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. ప్రభుత్వానికి మనసు ఉంటే...మనిషికే కాదు, ఇంటింటికీ మేలు చేయాలనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, పాలన....వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే అలాంటి పాలనతోనే వెళ్లిపోయింది. బాగుపడేందుకు ప్రభుత్వపరంగా మనం ఏం చేయాలి అనే పరిస్థితి ఈ అయిదేళ్లలో ఎక్కడా కనిపించలేదు. రైతన్న ఆవేదన, బాధను నేను చూశాను. మీ అందరికీ భరోసా ఇస్తూ ... నేను ఉన్నాను అని కచ్చితంగా చెబుతాన్నాను.
‘మన రాష్ట్రంలో 50 శాతం జనాభాలో మహిళలు ఉన్నారు. ఆ అక్కచెల్లెమ్మల పరిస్థితిని నా పాదయాత్రలో చూశాను. అప్పులు మాఫీ కాలేదన్న బాధ డ్వాక్రా మహిళల్లో చూశాను. నిజానికి వారు సంతోషంగా ఉంటే వారి కుటుంబాలు, గ్రామాలు.. చివరకు రాష్ట్రం బాగుంటుంది. పాదయాత్రలో వారి కష్టాలు చూశాను. వారి అప్పులు మాఫీ కాలేదు. వడ్డీలు పెరిగాయి. చివరకు సున్నా వడ్డీ రుణాల జాడే లేదు. వారి బాధలన్నీ నేను విన్నాను. అందుకే వారికి కూడా ‘నేనున్నాను’ అనే భరోసా ఇస్తున్నా. ఇక ఆడపిల్లలకు, మహిళలకు భద్రత ఉంటుందనుకుంటేనే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. కానీ నా పాదయాత్రలో గమనించా. గ్రామాల్లో మద్యం అమ్మే షాపులు విచ్చలవిడిగా కనిపించాయి. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నా మాట మరచిపోయారు. చీకటి పడితే రోడ్డు మీదకు వెళ్లాలంటే ఆడవాళ్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని నా కళ్లారా చూశాను. మీకు చెబుతున్నా... ఎలాంటి ఆందోళన వద్దు...నేను మీకు భరోసాగా, భద్రతగా ఉన్నానని చెబుతున్నా.
పిల్లలు ఉన్నత చదువులకు కన్నవాళ్లు తమ ఆస్తులు అమ్ముకుంటున్నారు...ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పాదయాత్రలో చాలా చూశాను. ఉద్యోగాల కోసం ఆశగా చూస్తున్న యువతను చూశాను. ‘అన్నా రాష్ట్రం విడిపోయేటప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఎందుకన్నా ఉద్యోగాలు మాకు ఇవ్వడం లేదు. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు అయిపోయి ఉద్యోగాలు వెతుకుతున్న వారికి చెబుతున్నా...నేనున్నానని చెబుతున్నా. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాకపోవడం చూశాను. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవడం చూశాను. 108 అంబులెన్స్ సకాలంలో రాక ప్రాణాలు పోవడాన్ని చూశాను. ఆరోగ్యశ్రీ వర్తించక పూర్తిగా అస్వస్థత అయ్యి, కుర్చీకే పరిమితం అయ్యి, అప్పులపాలై, చావుకోసం ఎదురు చూస్తున్న పేదవాడి కుటుంబాన్ని చూశాను. మీ కష్టాలను చూశాను,... మీ బాధలు చూశాను మీ సందర్భంగా మీ అందరికీ నేనున్నాను అని చెబుతున్నా.
బాబుగారి పాలనలో అవ్వా తాతల పెన్షన్లు పెరగవు. అదే ఎన్నికలు వచ్చేసరికి మూడు నెలల ముందు అవ్వా, తాతల పెన్షన్ పెరుగుతుంది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అవ్వాతాతలను చూశాను. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ అడిగే ప్రశ్నలు విన్నా. మీరు ఏ పార్టీ వాళ్లు అని అడగడాన్ని చూశాను. పెన్షన్ ఇవ్వాలన్నా, కావాలన్నా పెన్షన్ ఇవ్వాల్సిందే. అలాంటి బాధితులకు నేను చెబుతున్నా...నేను ఉన్నాను. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినా...ప్రతి మనిషి గుండె చప్పుడులో ఎలా ఉన్నారో, అంతకన్నా గొప్ప పాలన ఇచ్చేందుకు నేను ఉన్నానని చెబుతున్నా.
చంద్రబాబు అన్యాయపు పాలనతో ఆయన చేస్తున్న మోసాలు, అన్యాయాలు చూస్తున్నాం. ఎన్నికల్లో ఓట్లు అడిగితే... ప్రజలు వేయరని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి ప్రజల ఓట్లు తీసేస్తాడు, దొంగ ఓట్లు ఎక్కిస్తాడు. ప్రజల బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు చోరీ చేస్తారు. ఎన్నికల్లో గెలిసేందుకు బలమైన అభ్యర్థులను బలహీనపరిచేందుకు చివరకు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని గజదొంగలా దోచేసుకుంటారు. అన్నీ చేసేసి...చివరకు ఆ పెద్దమనిషి దొంగే...దొంగ...దొంగ...దొంగ అని అరిచినట్లు ఉంది. మరో 20 రోజుల్లో ఇంకా అన్యాయమైనవి చాలానే చూస్తాం. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అన్నింటితో పోరాటం చేస్తున్నాం. వీళ్లంతా 20 రోజుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. మీ అందర్ని కోరేది ఒక్కటే. చంద్రబాబు అన్యాయాలు ఇంతటితో ఆగిపోవు.
ఆయన మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ గ్రామాల్లోకి వెళ్లి అందరికీ చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చేరూ.3 వేలు చూసి మోసపోవద్దు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి రూ.15వేలు ఇస్తాడని ప్రతి ఒక్కరికీ చెప్పాలి. ఇక మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి పరిస్థితి. ఇరవై రోజులు ఓపిక పడితే మన ప‍్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు అన్నింటినీ అన్న భరిస్తాడు అని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పాలి. అలాగే రైతన్నకు చెప్పాల్సిన బాధ్యత మీదే. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు ప్రతి ఊరు, ఇల్లు, గడప గడపకూ తీసుకువెళ్లండి. పాణ్యం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డికి మీ ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment