‘బీసీ వర్గానికి చెందిన నా చెల్లి ఉషాను ఎమ్మెల్యేగా...మా అన్న తలారి పీడీ రంగయ్యను ఎంపీగా ఆశీర్వదించి గెలిపించండి’ అంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. గురువారం కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఎన్నికల సభలో అభ్యర్థులిద్దరినీ ఆయన పరిచయం చేస్తూ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఉషాశ్రీచరణ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. మంచి మనిషి అంటూ పరిచయం చేశారు. తలారి పీడీ రంగయ్య ఓ మంచి అధికారి అని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని అలాంటి వారిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
ప్రలోభాలను తిప్పికొట్టండి
అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు ఓటమి అంచుల్లో ఉన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు మోసం చేశారు. డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టండి. బీసీలకు వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి నన్ను ఎంపీగా, ఉషాశ్రీచరణ్‌ను ఎమ్మెల్యే గెలిపించండి. నవరత్న పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు జగనన్న సిద్ధంగా ఉన్నారు. సింహం లాంటి జగన్ వాస్తవాలే చెబుతారు. ఎక్కడ చూసినా జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. ఈ ఐదు రోజులు కష్టపడి పనిచేయండి. – కళ్యాణదుర్గం బహిరంగ సభలో తలారి పీడీ రంగయ్య, ఎంపీ అభ్యర్థి
బీసీ, మైనారిటీల పక్షపాతి జగన్
బీసీలు, మైనారిటీలకు చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జగన్ మోహన్‌రెడ్డి ముందుకెళుతున్నారు. మాట తప్పని మడమతిప్పని నాయకుడంటే ఆయనే. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్. ఆయనను ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పాలన అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా మహమ్మద్ ఇక్బాల్ సార్‌ను, ఎంపీగా నన్ను గెలిపించండి. – గోరంట్ల మాధవ్, ఎంపీ అభ్యర్థి, హిందూపురం
బీసీ మహిళకు గుర్తింపునిచ్చారు
నేను జగనన్న చేతిలో అస్త్రం లాంటిదాన్ని. ఓ బీసీ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు జగనన్న సారథ్యంలోనే మేలు జరుగుతుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరేమి కావాలి. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లా, ప్రేమతో ఆశీర్వదించారు. కళ్యాణదుర్గం వెనుకబడిన ప్రాంతమని, 114 చెరువులను నీటితో నింపి, ఆయకట్టుకు అందించాలని, తిమ్మసముద్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని జగనన్నను కోరా. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. భవనాలు కూల్చబోం. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతుంది. – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే అభ్యర్థి, కళ్యాణదుర్గం
సమస్యలన్నీ తీరుస్తా..
మైనారిటీ, బీసీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్‌ను సీఎంని చేసుకుందాం. ఇక్కడే ఉంటూ చిత్తశుద్ధితో ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా. తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా. – మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment