మంగళవారం విజయవాడలో గవర్నర్‌ను శాలువాతో సత్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/గన్నవరం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో బస చేసిన గవర్నర్‌ను వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో కలిశారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. అసెంబ్లీలో రాబోయే అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్‌కు వివరించినట్టు సమాచారం. అంతకుముందు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్న గవర్నర్‌కు విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, నూజివీడు సబ్‌కలెక్టర్ స్వప్నిల్‌దినకర్, విజయవాడ డీసీపీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గవర్నర్ విజయవాడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment