ప్రజలకు వైఎస్‌ జగన్ కృతజ్ఞతలు | YS Jagan Mohan Reddy press meet in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రజలకు వైఎస్‌ జగన్ కృతజ్ఞతలు

Published Thu, Apr 11 2019 8:38 PM | Last Updated on Thu, Apr 11 2019 9:58 PM

YS Jagan Mohan Reddy press meet in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీవ్రంగా ఆక్షేపించారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరించారని విమర్శించారు. గురువారం పోలింగ్ పూర్తయిన తర్వాత రాత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బెదిరించడం, ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించడం, అనేకచోట్ల అరాచకాలు, డ్రామాలు ఆడటం వంటివెన్నో చేశారని దుయ్యబట్టారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు అన్నింటిని దాటుకున్ని ఓటు వేసిన ప్రజలకు వైఎస్‌ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని, వారికి పార్టీ అన్నవిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నా. పోలింగ్‌ సందర్భంగా చిత్తూరు, అనంతపురంలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. వాళ్లందరికీ నా ప్రగాఢ సానుభూతి. టీడీపీ చేసిన చర్యలు చాలా బాధాకరం. విజయనగరం జిల్లా కురుపాంలో పుష్ప శ్రీవాణి, గురజాలలో కాసు మహేష్‌ రెడ్డి, పూతలపట్టులో ఎంఎస్‌ బాబుపై టీడీపీ నేతలు దాడులు చేశారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్‌ యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు. మేరుగ నాగార్జునపై టీడీపీ నేతలు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అక్కడక్కడ సమస్యలు రావడానికి రాక్షసుడిగా ఉన్న చంద్రబాబు కారణమని, ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులను చంద్రబాబు మోసం చేశారని, అలా మోసం చేసిన వారిని ప్రజలు మరిచిపోరని వ్యాఖ్యానించారు. రిటర్న్ గిఫ్ట్ ల వ్యవహారం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సాగిందని, అందులో తమకెలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటింగ్ శాతం తగ్గించడానికి కుయుక్తులు పాల్పడటం వంటి పనులు చేయడానికి చంద్రబాబు సిగ్గుపడాలి. ఓటింగ్‌ శాతం పెరిగితే.. ఈవీఎంలలో తప్పులు ఉన్నాయని ఎలా చెబుతారు?. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం మాకు అనుకూలం. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. దేవుడి దయ వల్ల పోలింగ్ శాతం పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓటేస్తే వీవీ ప్యాట్‌లో వాళ్ల ఓటు కనిపిస్తుంది. నా ఓటు నాకు కనిపించింది. ఇంత శాతం పోలింగ్ జరిగితే టీడీపీ వాళ్ల ఆరోపణలు నిరాధారం. దేవుడి దయ, ప్రజల దీవెనతో వైఎస్సార్ సీపీకి భారీ విజయం తధ్యం.’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement