సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను అత్యంత ముఖ్యమని, వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్‌తో వైఎస్ జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ప్రశ్న-జవాబుల రూపంలో సాగిన ఈ సదస్సులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ఇండియా టుడే: మీరు సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. మీలా ఎవరూ ఇంత సుదీర్ఘంగా చేయలేదని ప్రజలు అంటున్నారు?
వైఎస్ జగన్: పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నాను. పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం. అందుకు ఏం చేయాలన్నది పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉండి నిశితంగా గమనించాను.
ఇండియా టుడే: రాజకీయ నాయకుడి మీ ప్రయాణం ఎలా సాగింది?
వైఎస్ జగన్: నా తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం అంతా ప్రజల మధ్యలోనే గడిచింది. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఉన్నది ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచాను. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకున్నాను.
ఇండియా టుడే: ప్రభుత్వ వ్యతిరేకత గురించి చెబుతున్నారు?
వైఎస్ జగన్: ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే. ఎన్నికలకు ముందు చంద్రబాబె ఎన్నో హామీలు ఇచ్చారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా.. చేస్తానని వాగ్దానం చేసి.. అన్నదాతలను మోసం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో అంతకుముందు వరకు వచ్చే వడ్డీలేని రుణాలను కూడా ఇప్పుడు రైతులు పొందలేకపోతున్నారు.
ఇండియా టుడే: మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? వైఎస్సార్ సంక్షేమ రాజ్యానికి మీ పరిపాలనకు తేడా ఏమిటి?
వైఎస్ జగన్: చంద్రబాబు పరిపాలనలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఓ వర్గం వారికి మాత్రమే చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. తమకు ఓటేసిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ వివక్ష చూపించారు. కానీ, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటాం. మేం ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది
ఇండియా టుడే: జాతీయ రాజకీయాలపై మీ విధానం ఏమిటి?
వైఎస్ జగన్: జాతీయ స్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయి. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏపీని విభజించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటైపార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయి. పార్లమెంటు ద్వారాలు మూసేసి. లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి.. విభజన బిల్లును నెగ్గించుకున్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి?
ఇండియా టుడే: ఏపీ ఎన్నో రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుంది కదా? హోదా ఎందుకు?
వైఎస్ జగన్: ఇదే విషయం మీరు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎందుకు అడగలేదు? గతంలో ఇతర రాష్ట్రాలను విభజించినప్పుడు హోదా ఇచ్చారు కదా.. ఏపీ అడ్డగోలుగా విభజించినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? పార్లమెంటు మీద ఆశ, నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా..!
ఇండియా టుడే: అంటే హోదా ఒక్కటే మీకు ముఖ్యమా?
వైఎస్ జగన్: ఔను, మాకు మా రాష్ట్రం, మా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే ముఖ్యం. ఎవ్వరు ప్రధానమంత్రి అయినా మాకు మాత్రం హోదానే కావాలి. హోదా ఇవ్వేవాళ్లకు మా మద్దతు ఉంటుంది.
ఇండియా టుడే: ఎందుకు మీకు హోదా అంత అవశ్యకత? మీది పెద్ద రాష్ట్రం, ఎన్నో పరిశ్రమలున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రం కదా?
వైఎస్ జగన్: రాష్ట్రాన్ని విభజించినప్పుడు నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. మీ మాటను నిలబెట్టుకోవాలని నేను అడుగుతున్నాను. విభజన తర్వాత చుట్టు ఉన్న పెద్ద నగరాలతో ఏపీ ఎలా పోటీ పడుతుంది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో ఏ రకంగా పోటీపడతా? కేంద్రం హోదా ఇచ్చి.. 100 శాతం పన్ను రాయితీలు కల్పిస్తేనే.. ఇతర నగరాలతో పోటీపడి అభివృద్ధి సాధించగలం. హైదరాబాద్‌లో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఓ పరిశ్రమ, ఆస్పత్రి, ఫ్యాక్టరీ ఏపీలో ఎలా పెడతారు? అందుకే మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ నిలబడగలదు.
ఇండియా టుడే: ఎవరు ఎక్కువ శత్రువుల నరేంద్రమోదీనా? రాహులా?
వైఎస్ జగన్: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించి మోసం చేస్తే.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఏపీ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment