సాక్షి, అనంతపురం : ‘జీతాలు పెంచండని గళమెత్తిన హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లను టీడీపీ సర్కార్ అరెస్టులు చేయించింది. ఎన్నికలకు 6 నెలల ముందు నామమాత్రంగా జీతాలు పెంచి మరోసారి మోసం చేయాలని చూస్తోంది. కనీసం పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇచ్చే జీతాలన్న ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మెరుగైన జీతాలిస్తాం.. తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే అందిస్తాం. ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేలమంది కార్మిక సోదరులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామినిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
మంత్రిగారికి పట్టదు..
జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అనంతపురానికి తీసుకొచ్చిన ఘనత దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డిది. కానీ, టీడీపీ అయిదేళ్ల పాలనలో కళ్యాణదుర్గం నిజయోజకవర్గ పరిధిలో గల 114 చెరువులను నింపేందుకు ఉద్దేశించిన భైరవాని దిబ్బ ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లే కాలువ పనులు నత్తనడక సాగుతున్నాయి. 61 కి.మీ పొడవైన కాలువ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూములకు ఇప్పటికీ రైతుకుల పరిహారం ఇవ్వలేదు. రైతుల పట్ల బాబుకు ఎంత ప్రేముందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. పిల్లకాలువలన్నీ పూర్తి చేసి హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశమున్నా వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
ఈ నియోజకవర్గంలో టమోటా సాగు ఎక్కువగా ఉంది. కనీసం కిలోకు రూ. 10 రానిదే పెట్టుబడి ఖర్చులకు కూడా సరిపోవు. అలాంటిది కేజీ టమోటా ధర రూ.3కి పడిపోయాయి. ఇక సీజన్‌లో అయితే కేజీ టమోటా రూపాయికి పడిపోవడంతో.. పంటను రోడ్డుపైనే పడేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అరటి పంట రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కేజీ అరటికి రూ. 10 నుంచి 12 రానిదే గిట్టుబాటు కాదు. కానీ రూ.7 మాత్రమే వస్తోంది. ఖరీఫ్‌లో వేరుశనగ పంటలేస్తాం. కనీస మద్దతు ధర రూ.4890. అయితే, దళారులు.. ప్రభుత్వ సాయం కరువవడంతో.. రూ. 3 వేలకు కూడా కొనుక్కునేవారు రారు. 10 బస్తాలు పండాల్సిన చోట రెండు మూడు బస్తాలు కూడా పండకపోవడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దారుణమైన పరిస్థితులు చూశాం.
ఇదే నియోజకవర్గంలో 20 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే... టీడీపీ ప్రభుత్వం 11 మందే అని అబద్ధాలు చెప్తుంది. ఆ 11 మందిలో నాలుగు కుటుంబాలకే నష్టపరిహారం అందించింది. అదికూడా పూర్తిగా చెల్లించకుండా టీడీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారు. రైతులకు, పేదలకు మంచి చేయాలన్ని ఆలోచన సీఎం చంద్రబాబుకు, మంత్రి కాలువ శ్రీనివాస్‌కు లేనేలేదు. వారి ధ్యాసంతా వేదవతి నది నుంచి ఇసుక దోపిడీ ఎలా చేయాలని మాత్రమే ఉంటుంది. కళ్యాణదుర్గంలో రోడ్డు విస్తరణ పేరిట దుకాణాలు, భవనాలు కూల్చేశారు. కనీసం నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు. వీళ్లసలు మనుషులేనా.! టీడీపీ అరాచక పాలనలోనే నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో మీ బాధలు, కష్టాలు చెప్పారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాను. ఈ సభలో మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. మీ అందరికీ నేనున్నాను అని మాటిస్తున్నాను. కల్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉషశ్రీపై, అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్యపై మీ దీవెనలు, చల్లని ఆశీస్సులు ఉంచండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment