సాక్షి, పెందుర్తి (విశాఖ జిల్లా) : ‘అధికారంలోకి రాగానే మీ సమస్యలను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నంరెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి కాండ్రేగుల సత్యవతిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
మీ సమస్యలను నేను విన్నాను..
‘రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. ఆ పాదయాత్రలో పెందూర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్యను మీరంతా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలను విన్నాను.. ఆ కష్టాలను నేను స్వయంగా చూశాను. మీ అందరికి అండగా నేనున్నానని భరోసా ఇస్తున్నాను. మంచి చేయమని ఓట్లు వేస్తే.. ఆ టీడీపీ నేతలు గద్దల్లా జిల్లాలో భూములు దోచుకున్నారు. భూ అక్రమణ కోసం దళిత మహిళపై దారుణంగా దాడి చేశారు. పంచగ్రామ సమస్యను.. నా సమస్యగా భావించి పరిష్కరిస్తా. గుడిపెద్దలతో మాట్లాడి కచ్చితంగా భూములకు పట్టాలు ఇప్పిస్తాం. కాలుష్య ప్రభావితమైన గ్రామాల్లోని ప్రజలను అధికారంలోకి రాగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకుంటాం. ఎన్నికల వేళ 20 రోజులుగా జరుగుతున్న కట్రలు, మోసాలను మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో చూసిందేమిటి? ఎన్నికల ముందు ఆయన చెప్పిందేమిటి? ఆ తరువాత చేసిందేమిటి? ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. చంద్రబాబు పాలనలో చేసిందేమిటంటే మోసం.. మోసం.. ఆయన పాలనపై చర్చ జరగకూడదని రోజుకో కుట్రకు తెరలేపుతున్నారు. ఈ కుట్రలు, మోసాలు గమనించాలని కోరుతున్నా.
అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం..
ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించండి. ప్రస్తుతం మన పిల్లలు ఇంజనీరింగ్ చదివే పరిస్థితుల్లో ఉన్నారా? అని ప్రతి అక్కను అడగండి. అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. అప్పుడు మన పిల్లలను ఇంజనీరింగే కాదు.. డాక్టర్, కలెక్టర్ చదువులకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా అందజేస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment