అప్పుడే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Public Speech In Tekkali | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్‌ జగన్‌

Published Sun, Apr 7 2019 4:25 PM | Last Updated on Sun, Apr 7 2019 7:17 PM

YS Jagan Public Speech In Tekkali - Sakshi

సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం) : మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని, వాటిని అమలు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అ‍ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు 50 పేజీల మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారని, ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు 34 పేజీలతో మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని, ప్రజలు ఆలోచించాలని కోరారు. తాము నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ఒకే పేజని..రెండు వైపులు మాత్రమే ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. నవరత్నాల్లో చెప్పిన మాటలు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు మేనిఫెస్టోలో పెట్టామని స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రోజు చూపిస్తామని, ఎవరూ మర్చిపోకుండా చేస్తామన్నారు. ప్రతి రోజు ఇది చెప్పాం.. ఇది చేశామని అందరికి చూపిస్తామని తెలిపారు.

ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వస్తామని, ఇందులో చెప్పిన ప్రతి మాటను చేశామని. మళ్లీ మమ్మల్ని గెలిపించండని అడుగుతామన్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని , ప్రతి రాజకీయ నాయకుడు తాను చెప్పిన పనిని చేయకపోతే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని అన్నారు. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తోందని తెలిపారు. ఇది తన ఒక్కడి వల్ల కాదని, ప్రజల సాకారం కావాలని కోరారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్‌ ‌‌‌, శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. 

మాటిచ్చాను..  అండగా ఉంటాను..
‘టెక్కలి నియోజకవర్గంలో కూడా నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట, ఆవేదన, బాధలు, కష్టాలు నాకు ఇంకా గుర్తుకున్నాయి. ఈ రోజు మీ అందరికి నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నాను. మహేంద్ర తనయ ప్రాజెక్ట్‌కు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శ్రీకారం చుట్టి.. రూ.62 కోట్లు కూడా ఖర్చు చేసి 40 శాతం పనులు పూర్తి చేశారు. ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్ట్‌ను ఎవరు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచి దోచుకున్నారు. భూనిర్వాసితులను పట్టించుకోలేదు. పవర్‌ప్లాంట్‌ను 51 గ్రామాలు వ్యతిరేకిస్తున్నప్పుడు అధికారంలో రాగానే రద్దు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అనుమతులిస్తూ జీవోలు జారీ చేశారు. ఆ 51 గ్రామాల ప్రజలకు చెబుతున్నా.. పాదయాత్రలో మీ అందరికి మాటిచ్చాను..  మీకు తోడుగా ఉంటానని మళ్లీ పునరుద్ఘాటిస్తున్నాను. తీరప్రాంత గ్రామాల్లో మత్స్య కార్మికులకు.. కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మరిచారు. ఆ ప్రతి మత్స్యకారుడికి చెబుతున్నా.. నేను అండగా ఉంటాను. 

తిత్లీ తుఫానుతో ఇచ్చాపురం, పలాస, టెక్కలి ప్రాంతాలన్నీ అంతా అతలా కుతలం కావడం చూశాం. రూ. 3,648 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కానీ ఆ తరువాత ఆయన మాత్రం రూ.510 కోట్లు ఇచ్చారు. జరిగిన నష్టంలో 15 శాతం కూడా ఇవ్వలేదు. ఆ బాధితులందికి ఇప్పటికే చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. మనం అధికారంలోకి రాగానే కొబ్బరి చెట్టుకు రూ. 3000 ఇస్తాను. జీడీకి హెక్టార్‌కు రూ.50వేలు ఇస్తాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిందేమిటో ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. శ్రీకాకుళంలో జరిగే ఇసుక దందాకు ఇక్కడి మంత్రి అచ్చెన్నాయుడు రింగ్‌ మాస్టర్‌. ప్రజలకు చేసిందేం లేదు. కానీ స్కెచ్‌లు వేసి అధికార దర్వినియోగం చేశారు. రూ.5 కోట్ల విలువ చేసే ఏపీఎస్‌ఆర్టీసీ స్థలాన్ని రూ.3 లక్షలకు కాజేసీ ప్రయత్నం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు రింగ్‌ మాస్టర్‌ అయితే గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు మాఫియాలా దోచేస్తున్నాయి.

చంద్రబాబు హామీలు నెరవేర్చాడా?
చంద్రబాబు మోసపూరిత పాలనపై ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. 2014 ఎన్నికలప్పుడు టీవీ యాడ్స్‌తో ఊదరగొట్టారు. జాబు రావాలంటే.. బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతని చెప్పారు. ప్రతి ఇంటికి రూ.లక్ష 50వేలు బాకీ పడ్డారు. డ్వాక్రా మహిళలు, రైతులను దారుణంగా మోసం చేశాడు. మళ్లీ ఈ రోజు మోసం చేసేందుకు అవే టీవీల్లో మళ్లీ అదే మేనిఫెస్టోతో ఊదరగొడుతున్నారు. 2014లో చంద్రబాబు చెప్పిన మేనిఫోస్టో అంశాలు.. వ్యవసాయ రుణాలు మాఫీ.. అయ్యాయా? రూ.5వేల కోట్లతో ధరల స్థీరికరణ.. పెట్టారా? బెల్ట్‌ షాపుల రద్దు.. అయ్యిందా? ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఉందా? యువతకు ఉద్యోగం, ఉపాధి, ఇంటి ఇంటికి ఉద్యోగం.. వచ్చిందా? పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ విద్య. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద ఇంటింటికి రూ.20 లీట్లర మంచినీటి వాటర్‌ క్యాన్‌.. వచ్చిందా? యాబై పేజీలు.. 650 హామీలు ఇచ్చారు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారు. ఈ మేనిఫెస్టో కూడా కనిపించకుండా మాయం చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా. 2014 హామీలను 100 శాతం చేశానని సిగ్గులేకుండా చెబుతున్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదని, ఆయన పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ఆయన పచ్చమీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తుంది. 

ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు.  ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement