సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోనే మళ్లీ ఇప్పుడు చంద్రబాబు విడుదల చేసి, ప్రజల చెవుల్లో పువ్వులు పెడతారని అన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను శనివారం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలా మాట తప్పారో సోదాహరణంగా వివరించారు.
సున్నా వడ్డీకి మంగళం
పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేయకపోగా మే, 2016 నుంచి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేసేశారని తెలిపారు. పసుపు-కుంకుమ మోరుతో మరో మోసం చేశారు. ‘డ్వాక్రా బృందాలు ఎక్కువగా 5 లక్షలు, 7 లక్షలు, పది లక్షలు ఎక్కువగా తీసుకుంటాయి. వడ్డీ 12 శాతం వేసుకున్నా 5 లక్షలు తీసుకుంటే ఏడాదికి 60 వేలు, 7 లక్షలు తీసుకుంటే 84 వేలు, 10 లక్షలు తీసుకుంటే లక్షా 20 వేల రూపాయాలు వడ్డీ కింద కట్టాల్సివుంటుంది. 2016 నుంచి సున్నా వడ్డీ పథకం రద్దు చేయడంతో మూడేళ్లలో రుణభారం వరుసగా లక్షా 80 వేలు, 2 లక్షల 50 వేలు, 3 లక్షల 60 వేలు. ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ డ్రామా కింద ఒక్కో గ్రూపుకు ప్రభుత్వం ఇస్తున్నది లక్ష రూపాయలు. అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు వడ్డీలకు కూడా రావడం లేదు. ఇది మోసం కాదా’ అని ప్రశ్నించారు.
మళ్లీ మోసమా?
రైతులను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేశారని వైఎస్ జగన్ అన్నారు. రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారని తెలిపారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు రుణాలు మాఫీ చేయకపోవడంతో వ్యవసాయ రుణాలు లక్షా 50 వేల కోట్ల రూపాయలకు ఎగబాకాయి. సీఎంగా మొదటి సంతకం కింద 24,500 కోట్లు ఇస్తానని చెప్పాడు. కానీ సంవత్సరానికి ఇచ్చింది 3 వేల కోట్లు. ఐదేళ్లకు కలిపి 14 వేల కోట్లు మాత్రమే ఇచ్చాడు. కనీసం వడ్డీలకు కూడా రాలేదు. గత ప్రభుత్వాలు కట్టినట్టుగానే రైతుల తరపున వడ్డీలు కూడా కట్టలేదు. ఎన్నికలు వచ్చాయని మళ్లీ మోసం చేయడం ధర్మమేనా’ అని జగన్ ప్రశ్నించారు.
నిరుద్యోగులకు టోకరా
ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, ఉపాధి కల్పిస్తానని.. లేకుంటే నెలనెలా 2 వేల రూపాయల భృతి ఇస్తానని హామీయిచ్చి చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల కుటుంబాలు ఉన్నాయని, 60 నెలలుగా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ప్రతి కుటుంబానికి లక్షా 20 వేలు రూపాయలు బాకీ పడ్డారని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు కేవలం మూడు వేలు మాత్రమే ఇచ్చారని వివరించారు. అది కూడా 3 లక్షల కుటుంబాలకే ఇచ్చారని, రెండు వేలు ఇస్తానని వెయ్యి రూపాయల భృతి మాత్రమే చెల్లించారని వెల్లడించారు. చంద్రబాబు మాటలకు మరోసారి మోసపోవద్దని ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనాలు
కొత్త అధ్యాయానికి నాంది: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment