
ధర్మవరం (అనంతపురం): చేనేతలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. చేనేతలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేం దుకు ఈనెల 17న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధర్మవరానికి వస్తున్నారని వెంకటరామిరెడ్డి చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. నేతన్నల దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు, దగాకోరు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, అవస్థలు పడుతున్న చేనేత కార్మికులకు ధైర్యం చెప్పేందుకు జగన్ ఇక్కడికి వస్తున్నారని వెంకటరామిరెడ్డి తెలిపారు.
చేనేతలకు సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ఆ రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. తనకు అన్నీ ఆన్‌లైన్‌లోనే తెలుస్తాయని చెప్పుకునే సీఎంకు గిట్టుబాటు ధర లేక, సంక్షేమ పథకాలు అందక బలవన్మరణాలకు పాల్పడుతున్న, వలసపోతున్న చేనేత కార్మికులు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. 33 రోజులుగా తమ పార్టీ ఆధ్వర్యంలో నేతన్నలు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తే.. చేనేత కార్మికుల పట్ల సీఎంకున్న చిత్తశుద్ధి అవగతమవుతుందన్నారు. నేతన్నలకు మద్దతుగా అధికారులను ప్రశ్నించేందుకు వెళితే తమ పార్టీ నాయకులను పోలీసులచేత అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత దీక్షలను ఎత్తి వేయించేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. నేతన్నలకు న్యాయంగా దక్కాల్సిన సంక్షేమ పథకాల గురించి తాము పోరాటం చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment