భారీ ర్యాలీ నడుమ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభివాదం
ముదిగుబ్బ : ఎన్నికల సమయం దగ్గర పడుతోంది.. ప్రతి కార్యకర్తా సైనికుల్లా పనిచేసి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని వాసవీ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కదిరి వైపునున్న పెట్రోల్ బంకు సమీపం నుంచి వాసవీ కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు.
నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ న్యాయం
కేతిరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, పథకం గురించి ప్రతి ఇంటా వివరించి, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 20 నుంచి టీఎన్ పాళ్యం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి, ప్రతి గ్రామాన్నీ తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే మండలం నుంచి 15 వేలకు పైగా మెజార్టీ తీసుకురావాలన్నారు. 20 ఏళ్ల పాటు టీడీపీ నామ రూపాలు లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిపికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
అంతర్గత విభేదాలు వీడండి
ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయని కేతిరెడ్డి అన్నారు. గ్రామాల్లో అంతర్గత విభేదాలు వీడి కలసి కట్టుగా పని చేయాలన్నారు. మన పార్టీలోకి ఎవరు చేరినా అభ్యంతరాలు చెప్పకూడదన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నాతో ఎవరికి అవసరం ఉన్నా సిఫార్సు లేకుండా స్వయంగా వచ్చి సమస్య చెప్పుకోవచ్చన్నారు.
టీడీపీ ప్రయోజనం కోసమే జనసేన
చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చడానికే జనసేన పార్టీ పెట్టారేగానీ ప్రజాసేవ చేయడానికి కాదని కేతిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేయడానికి వస్తారన్నారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే వరదాపురం సూరి చిత్రావతిలో ఇసుక తరలించి, రైతుల పొట్ట కొడుతున్నాడన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ముదిగుబ్బలో భూసేకరణ పేరుతో 110 ఎకరాలకు రైతులకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారని, ఆ భూములను లాక్కుని రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలనుకుంటున్నాడన్నారు. పచ్చాచొక్కాల నాయకులకు దిమ్మ తిరిగేలా పోలింగ్ రోజున ఏకపక్షంగా ఓట్లు పడే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇందుకూరి నారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేలూరి రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment