ధర్మవరం: ‘‘ఇసుక అక్రమ రవాణ జరిగితే సహించేదిలేదు.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆధారాలతో చూపితే ఒక్కో లారీకి రూ. లక్ష ఇస్తామని చెప్పారు కదా..? ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణకు చెందిన ఎన్‌ఎస్‌సీ కంకరప్లాంట్ వద్ద వందలాది లారీల ఇసుకను డంప్ చేశారు.. ఆ ఇసుక ఎక్కడినుంచి తోలారు.. దమ్ముంటే ఆ ఇసుక అక్రమం కాదు.. సక్రమమని నిరూపించగలరా..?’’ అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు పంచభూతాలను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.
ఇళ్లు కట్టుకునేందుకు సామాన్యులు రెండు ట్రిప్పుల ఇసుకను తోలుకుంటే నానా హంగామా చేసే రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు.. టీడీపీ నేతలు వందలాది లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఎందుకు పట్టింతుకోవడం లేదని ప్రశ్నించారు. సీసీరేవు, పీసీరేవు ఇసుక రీచ్‌ల వద్ద హిటాచీలు ఉంచి వందలాది లారీల్లో ఇసుకను తరలిస్తూ విక్రయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రీచ్‌లకు సంబంధంలేని ఉప్పర్లపల్లి చిత్రావతి వద్ద హిటాచీలు పెట్టి తోడుతున్నారని, ఆ ఇసుక ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ కంకరమిషన్ వద్ద డంప్‌చేశారని ఆధారాలతో చూపారు. లారీల్లో ఉన్న ఇసుక, కంకరమిషన్ వద్ద డంప్ ఫొటోలను మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఇసుక అక్రమ రవాణ చేస్తున్నట్లు ఆధారాలతో చూపితే ఒక్కో లారీకి లక్ష చొప్పున ఇస్తామని బడాయిమాటలు చెప్పారనీ...తాను 1,500 లారీల ఇసుకను డంప్ చేసినట్లు ఆధారాలతో సహా బయటపెట్టాననీ..ఈ లెక్కన లారీకి రూ. లక్ష చొప్పున రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందనీ, ఆమెత్తాన్ని ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబాలకు ఇవ్వాలన్నారు.
నా లారీలైతే కాల్చిపారేయండి
స్థానిక టీడీపీ నేతలు ఎక్కడ ఇసుక లారీలు పట్టుకున్నా... కేతిరెడ్డివేనని అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. ఇక మీదట ఎక్కడ ఇసుక లారీ పట్టుపడినా.. ఆ లారీలన్నింటినీ కాల్చివేయవచ్చన్నారు. మీ ఎమ్మెల్యేకి చెందిన లారీలు అక్రమ ఇసుక రవాణ చేస్తే కాల్చిపారేయండని చెప్పే దమ్ము మీకుందా..? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దందాలు దోపిడీలతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కొందరు.. వారికి వెయ్యి, రెండువేలు ఇచ్చి అపర దాన కర్ణునిలా కలర్ ఇస్తున్నారని, కేవలం ఆర్జించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినవారు తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల అక్రమాలకు సహకరిస్తున్నారని... ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment