ప్రజల గొంతు ఎండబెడతారా? | Kethireddy Venkatrami Reddy Slams TDP | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతు ఎండబెడతారా?

Published Thu, Feb 21 2019 12:14 PM | Last Updated on Thu, Feb 21 2019 12:14 PM

Kethireddy Venkatrami Reddy Slams TDP - Sakshi

అనంతపురం, ధర్మవరంటౌన్‌: టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్రమార్జనకు అవకాశం దక్కదనే ఉద్దేశంతో పెద్దెత్తున తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సీబీఆర్, వైవీఆర్, హెచ్‌ఎన్‌ఎస్‌ ఎత్తిపోతుల పనుల్లో రూ.410 కోట్లు ఎక్సెస్‌ వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టడానికి సీబీఆర్‌ నుంచి కుప్పానికి నీళ్లు తరలించేందుకు కొత్త వ్యూహం రచించారన్నారు. జీవో 78 విడుదల చేసి సీబీఆర్‌ నుంచి చిత్తూరు జిల్లా కుప్పానికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా నీటిని తరలించేందుకు రూ.1825 కోట్లతో పనులను చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌)ను పెంచి రూ.410 కోట్లు దోచి పెట్టడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల ఫలితంగా జిల్లాలో 8 మంచినీటి పథకాలు నిర్వీర్యం అవుతాయన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలకు నీటి పథకాలు ఇబ్బందులు తప్పవన్నారు.

కుప్పానికి రోజుకు 2వేల     క్యూసెక్కులా ?: చిత్రావతిలో నీటి లభ్యతను అంచనా వేయకుండా రోజుకు 2వేల క్యూసెక్కులు కుప్పానికి తరలిస్తే ఇక ధర్మవరంలో ఉన్న మంచినీటి పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. చిత్రావతిలో నీటిని తరలించే ఆలోచన మానుకొని, ముందుగా నియోజకవర్గంలోని చెరువులు నింపి, ఆనీటిని తరలించాలన్నారు. ఈ విషయాలు పట్టించుకోకుండా చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే సూరి పాలాభిషేకం చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే జీవో 78లో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. 

మట్టి, కాంక్రీట్‌ పనుల్లోరూ.410 కోట్లకు పైగా దోపిడీ : సీబీఆర్, వైవీఆర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎత్తిపోతల పనుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని కేతిరెడ్డి అన్నారు. సాధారణంగా 5శాతం లోపు మాత్రమే పనుల్లో ఎక్సెస్‌ చేయడం చట్ట ప్రకారం జరుగుతుందన్నారు. ఈ పనుల్లో టీడీపీ ప్రభుత్వం 21 శాతం ఎక్సెస్‌ వేసి రూ.400 కోట్లకు పైగా కొల్లగొడుతున్నారన్నారు. బోర్డ్‌ఆఫ్‌ ఇంజినీర్స్‌ రూపొందించిన ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్‌) ప్రకారం మట్టి పనులు సాధారణంగా అయితే క్యూబిక్‌ మీటర్‌కు ప్రభుత్వం రూ.90 చెల్లించాలని, ఈ మట్టి పనులను మూడింతలు        (రూ.270 ) పెంచారన్నారు.ఈ పనుల్లో 1,69,35,436  క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందన్నారు. ఈ పనుల్లో  మూడింతలు పెంచడం వల్ల రూ.300 కోట్ల వరకు టీడీపీ నాయకులు దోచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంక్రీట్‌ పనుల్లో రూ.159 కోట్ల పనులకు గానూ ఎస్‌ఎస్‌ఆర్‌ వ్యాల్యూస్‌ కంటే ఎక్సెస్‌ వేయడం వల్ల టీడీపీ నాయకులు ఈ పనుల్లో రూ.110 కోట్లు దోచే స్తున్నారన్నారు. ఈ పనుల్లో రూ.410 కోట్ల దాకా ఎక్సెస్‌ పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement