కాలిపోయిన అరటి తోటను పరిశీలిస్తున్న కేతిరెడ్డి
అనంతపురం సెంట్రల్: ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎన్నికలకు రెండు నెలలు ముందు ప్రకటించిన విధంగానే నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అరాచకం సృష్టిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వరదాపురం సూరి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు వరదాపురం సూరి ‘ ఆరు నెలలు సమయం ఇస్తున్నాం. చంపుతారో చంపండి.. నరుకుతారో నరకండి.. మా పోలీసులు చూస్తూ ఉంటారు’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. అనుకున్న విధంగానే పోలింగ్ తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో మళ్ళీ ఫ్యాక్షన్‌కు తెరలేపుతున్నారని, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులుగా వారిపై దాడులు, హత్యాయత్నాలు, ఆస్తులు తగలబెట్టడం లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు తెరలేపాడని చెప్పారు.
పోలింగ్ తర్వాత ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈదులపల్లికి చెందిన లక్ష్మిరెడ్డిపై హత్యయత్నంకు పాల్పడ్డారని , ముదిగుబ్బ మండలంలో కాంట్రాక్టర్ నాగశేషు అనే వ్యక్తి చెందిన రెండు వాహనాలకు నిప్పుపెట్టారన్నారు. దాదాపు 20 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 65వ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌గా పనిచేసిన పరమేష్ అనే వ్యక్తికి సంబంధించి అరటితోటను కాల్చి వేశారన్నారు. దీంతో రూ.5 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించిందన్నారు. ఎలక్షన్ తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల హత్యకు సూరి ముందే కుట్రపన్ని పిలుపునివ్వడం జరిగిందన్నారు. సూరి కుమారుడు నితిన్‌సాయి ఎన్నికల సమయంలో ఈదులముష్టూరు తదితర గ్రామాల్లో చిచ్చుపెట్టి వెళ్ళాడని తెలిపారు. ఫలితంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొందన్నారు. సూరి వ్యాఖ్యలపై అప్పట్లోనే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కేసులోనూ వరదాపురం సూరినే ఏ1 ముద్దాయని, వెంటనే ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అశోక్‌కుమార్ ధర్మవరం నియోజకవర్గానికి వచ్చి స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు.
బాధిత కుటుంబాలకు కేతిరెడ్డి భరోసా
ముదిగుబ్బ : సార్వత్రిక పోలింగ్ అనంతరం ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వాహనాలను తగలబెడుతున్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం పరామర్శించారు. ఆస్తి నష్టపోయిన బాధితులు, రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment