జగన్‌ అనే నేను..  | YS Jaganmohan Reddy Swearing In Ceremony Today | Sakshi
Sakshi News home page

ఏపీ ముఖ్యమంత్రిగా నేడే వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

Published Thu, May 30 2019 1:58 AM | Last Updated on Thu, May 30 2019 8:17 AM

YS Jaganmohan Reddy Swearing In Ceremony Today - Sakshi

బుధవారం తిరుమలలో శ్రీవారి ధ్వజస్తంభానికి మొక్కుతున్న వైఎస్‌ జగన్‌

సాక్షి అమరావతి : అశేష ప్రజాదరణతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యద్భుత విజయం సాధించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. గురువారం మధ్యా హ్నం 12.23 గంటలకు విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్‌ తరలివస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రావాల్సి ఉన్నా.. కుటుంబంలో అత్యవసర కార్యక్రమానికి ఆయన హాజరుకావాల్సి ఉండటంతో రాలేకపోతున్నారు. మరికొంత మంది ముఖ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.

ఇక ‘జగన్‌ అనే నేను..’అంటూ తమ అభిమాన నేత చెబుతుంటే చెవులారా వినాలని కోట్లాది మంది ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంక్షేమ పాలన (వైఎస్సార్‌ పాలన) మళ్లీ రాష్ట్రంలో ప్రారంభం కానుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం వైఎస్‌ జగన్‌ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి మే 14న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఇపుడు, ఆయన తనయుడు జగన్‌ వైఎస్సార్‌ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి కుమారుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తన తండ్రి వేసిన సంక్షేమ బాటలో మరో అడుగు ముందుకు వేసి రాజన్న రాజ్యం తీసుకురావాలనే తలపుతో జగన్‌ ఉన్నారు. 


వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న ఇందిరాగాంధీ స్టేడియం

నవరత్నాల్లో కీలక అంశంపై తొలి సంతకం 
నాడు వైఎస్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. లక్షలాది మంది రైతులు ఈ పథకం వల్ల ఇప్పటికీ లాభపడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నవరత్నాల్లోని ఓ అంశానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ప్రధానమైన లక్ష్యంతో జగన్‌ నవరత్నాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ పథకాల్లోని అన్ని అంశాలూ తప్పకుండా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


విజయవాడకు చేరుకున్న గవర్నర్‌ 
వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా బుధవారం విజయవాడకు చేరుకున్నారు. బందరు రోడ్డులోని గేట్‌వే హోటల్‌లో బస చేసిన గవర్నర్‌ను వైఎస్‌ జగన్‌ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి ముందు రోజు జగన్‌ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ధార్మిక కార్యక్రమాలతో గడిపారు. ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి కడపకు చేరుకుని అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులలోని చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తరువాత ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రానికి విజయవాడకు చేరుకు ని కనకదుర్గమ్మవారి దర్శనం చేసుకున్నారు.  

లక్షలాది మంది హాజరు 
వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది విజయవాడకు బయలుదేరారు. అఖండ విజయం సాధించిన ఆనందంలో ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో సహా తరలి వస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. 30 వేల మంది స్టేడియంలో కూర్చునే ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి ఆనుకొని, వెలుపల భారీగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఒక గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రజలను గ్యాలరీతో పాటు స్టేడియం లోపల చుట్టూ ఉండే గ్యాలరీలోను అనుమతిస్తున్నారు. ప్రమాణస్వీకారోత్స కార్యక్రమం కోసం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశారు.  

ఐదు వేల మంది పోలీసులు.. 
కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. బుధవారం గేట్‌వే హోటల్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ బందోబస్తు ఏర్పాట్లు వివరించారు. ఐదు వేల మంది పోలీసుల్లో 1,200 మందిని ట్రాఫిక్‌ విధులకు కేటాయించారు. గురువారం ఉదయం 6 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బందరు రోడ్డులో భారీ వాహనాలను అనుమతించడంలేదు. పట్టణంలోని 14 ప్రాంతా ల్లో రద్దీ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రౌడ్‌)ను కంట్రోల్‌ చేసేలా ఆయా ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వచ్చే ఇతర భారీ వాహనాలు, ట్రాఫిక్‌ మళ్లింపునకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లా ఎస్పీలకు పలు ఆదేశాలు ఇచ్చారు. బందోబస్తు ఏర్పాట్ల సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.  


వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ముస్తాబైన ప్రకాశం బ్యారేజ్‌

ఆరు గేట్ల ద్వారా ప్రవేశం.. 
ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలకు సంబంధించి పాస్‌లు ఇచ్చారు. ఆరు గేట్లు ఏర్పాటు చేశారు. ఎఎ 300 మందికి, ఎ1 పాస్‌లు 1,000 మందికి, ఎ2 పాస్‌లు 2,300 మందికి, బి1 పాస్‌లు 500, బి2 పాస్‌లు 500 మందికి, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు 300 పాస్‌లు, ఆహ్వానితులకు 7 వేల పాస్‌లు మంజూరు చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి పాస్‌లు లేకుండానే లోనికి అనుమతిస్తున్నారు. స్టేడియం మెయిన్‌ గేటు నుంచి గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, డీఎంకే అధినేత స్టాలిన్‌ వస్తారు. గేటు నెంబర్‌ 2 నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ అధికారులు, జ్యుడీషియరీ ప్రతినిధులు, 3, 6 గేట్ల నుంచి పాస్‌లు ఉన్న ఆహ్వానితులను అనుమతిస్తారు. 4, 5 గేట్ల నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. గేటు 2 నుంచి వీఐపీలతోపాటు మీడియా ప్రతినిధులను అనుమతిస్తారు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ముఖ్యమంత్రులు, ఆర్టీఏ కమిషనర్ల వాహనాలకు పార్కింగ్‌ ఇచ్చారు. ఆర్‌అండ్‌బి ఆఫీసు ప్రాంతంలో వీఐపీల వాహనాలకు, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ప్రత్యేక ఆహ్వానితుల వాహనాలకు, బిషప్‌ అజరయ్య స్కూల్, స్టేట్‌ గెస్ట్‌హౌస్, సీఎస్‌ఐ చర్చి ప్రాంతాల్లో అధికారులు, మీడియా వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్, సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజీ, సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ మైదానాల్లో సాధారణ ప్రజల వాహనాలకు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.  

తరలిరానున్న ప్రముఖులు.. 
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. కేసీఆర్‌ విమానంలో గురువారం ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి గేట్‌వే హోటల్‌కు వచ్చి 12.08 గంటలకు స్టేడియానికి వెళ్తారు. కార్యక్రమం ముగిశాక ఇక్కడి నుంచే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. స్టాలిన్‌ గురువారం ఉదయం విజయవాడ రానున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వస్తారని భావిస్తున్నప్పటికీ బుధవారం పొద్దుపోయే వరకూ ఆయన పర్యటన ఖరారు కాలేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎంపీ, దివంగత వైఎస్సార్‌ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు హాజరవుతున్నారు. రాష్ట్ర బీజేపీ తరఫున ఒక ప్రతినిధి వస్తున్నారు. ఢిల్లీలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఆ పార్టీ నేతలంతా తరలి వెళుతున్నారు. ఇక స్టేడియంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, మరో వేదికపై గవర్నర్‌ నరసింహన్, కేసీఆర్, స్టాలిన్, వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు ఆసీనులవుతారని ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రోగ్రామింగ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం మీడియాకు వెల్లడించారు. 

జగన్‌కు మమత శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఆమె ట్విట్టర్‌లో తన సందేశాన్ని బుధవారం పోస్ట్‌ చేశారు.
 
వైఎస్‌ జగన్‌ పాలన విజయవంతం కావాలి
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేస్తున్న వైఎస్సా ర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున శుభాకాంక్షలు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వైఎస్‌ జగన్‌ నన్ను కూడా ఆహ్వానించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్‌ జగన్‌ తన పరిపాలన కొనసాగించాలని.. రాష్ట్రంలో విజయవంతంగా ఆయన పాలన సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.  
– సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి 

విజయవాడకు కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరగనున్న జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రికి సీఎం కేసీఆర్‌ ఢిల్లీలోనే బస చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement