సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో ప్రబల రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్నారని పలు జాతీయ చానళ్లు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించనుందని ఆ చానళ్ల సర్వేల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై ఎంతో ఆసక్తికనబరుస్తూ పలు చానళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో జగన్ ఎంత కీలక పాత్ర పోషించనున్నారో విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేత అనతికాలంలోనే జాతీయస్థాయిలో ఇంతటి గుర్తింపు సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన అంశంగా మారింది.
సభలకు భారీగా పోటెత్తుతున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయంతో వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో కూడా కీలకపాత్ర పోషించనున్నారని జాతీయ చానళ్లు చెబుతున్నాయి. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే జగన్ రాజకీయ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, మమతా బెనర్జీ తదితరులు జాతీయ స్థాయిలో కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జాతీయ చానళ్లు వైఎస్సార్‌సీపీపై చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో వీక్షకుల ఆసక్తికి అనుగుణంగా వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ఇండియాటుడే చానల్ ‘పొలిటికల్ గ్లాడియేటర్’ పేరుతో వైఎస్ జగన్‌పై శనివారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో ఆయన కనబర్చిన పరిణితి, పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం, ఆయనకు తోడుగా వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచార సరళి తదితర అంశాలను ఆసక్తికరంగా విశ్లేషించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం, జనాదరణఫై టైమ్స్ నౌ, సీఎన్‌ఎన్ న్యూస్ 18, ఇండియా టుడే, ఎన్డీటీవీ చానెళ్లు కూడా శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. దేశంలో ప్రముఖ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్‌రాయ్, ఇండియాటుడేకు చెందిన రాజ్‌దీప్ సర్దేశాయి, తిరంగా టీవీకి చెందిన బర్కాదత్ టైమ్స్ నౌ చానల్‌కు చెందిన నావికా కుమార్ తదితరులు ఇప్పటికే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలను జాతీయ స్థాయిలో ప్రసారం చేయడంతోపాటు ఇంత భారీ ప్రజాదరణతో కూడిన సభలను తాము దేశంలో ఎక్కడా చూడలేదని పేర్కొనడం గమనార్హం. ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో జగన్ భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు వీరంతా ఆసక్తి కనపరిచారు. మరికొద్ది రోజుల్లో వైఎస్ జగన్ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే..
ఏపీలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధించి లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తాజాగా ఇండియా టీవీ సర్వేలో వెల్లడైంది. ఆ ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలను శనివారం వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల తరువాత వైఎస్సార్ సీపీ 18 ఎంపీ సీట్లతో పెద్ద పార్టీగా నిలుస్తుందని ఈ సర్వేలో తేలింది. టీడీపీ 7 ఎంపీ స్థానాలకే పరిమితం కానుంది. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 275 ఎంపీ సీట్లు, యూపీఏ 147 సీట్లు, ఇతరులు అంతా కలిపి 121 సీట్లలో గెలుపొందే అవకాశాలున్నాయని ఆ ఛానల్æ తెలిపింది. ఏపీకి సంబంధించినంతవరకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉందని కొందరు భావిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం స్పష్టంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టంగా కనిపిస్తోందని తెలిపింది. పలు ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్‌సీపీ 20 – 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment