ప్రజాప్రస్థానం.. 16 ఏళ్లుగా ప్రజల గుండెల్లో పదిలం | YS Rajasekhara Reddy Padayatra Continues To Inspire All | Sakshi
Sakshi News home page

ప్రజాప్రస్థానం.. 16 ఏళ్లుగా ప్రజల గుండెల్లో పదిలం

Published Tue, Apr 9 2019 11:15 AM | Last Updated on Tue, Apr 9 2019 3:50 PM

YS Rajasekhara Reddy Padayatra Continues To Inspire All - Sakshi

పాదయాత్రలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫైల్‌)

అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు... అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను నేటికి సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు... ఏప్రిల్‌ 9న (2003) డాక్టర్‌ వైఎస్సార్‌ చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా) నుంచి ప్రారంభించారు. 68వ రోజున ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)లో ముగించారు.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి... ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్‌ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్‌’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించి దాదాపు పదేళ్లవుతున్నా, మధ్యలో పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘వైఎస్సార్‌’ ఓ శాశ్వత జ్ఞాపకం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతుకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌... ఇలా ఏ పథకం తీసుకున్నా అది ఓ ప్రయోగం, అంతకు మించి ఓ ప్రామాణికం. అన్ని వయసుల వారికీ బతుకుపై ఓ భరోసా! అన్ని విధాలుగా అలమటించిన రైతన్నకు ఓ ఊరట, నిశ్చింత! విభిన్న వర్గాల ప్రజాజీవితంలో వెలుగులు పంచుతూ గ్రామీణ–పట్టణ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించారు వైఎస్‌. రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపారు.

రెండంశాలే కీలకం!
చరిత్ర కలిగిన ఎందరో నాయకులకన్నా వైఎస్ రాజశేఖరరెడ్డిని భిన్నంగా నిలబెట్టే అంశాలు రెండు! ఒకటి, ఆయనకు ప్రజల పట్ల ఉండే అవ్యాజమైన ప్రేమ–నిబద్ధత. రెండు.. ఆయన మాటలు, చేతలు, మొత్తం నడతపై ఉన్న అపార నమ్మకం–విశ్వసనీయత! ఈ రెండే వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చరిత్ర మరవని జననేతగా మలిచాయి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లేక యువత నిస్తేజమైంది. తప్పు దారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, రాష్ట్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రపంచబ్యాంకు ప్రయోగశాల చేసిన తీరు.. వెరసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. రాజకీయ నాయకులు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్‌ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేరుగా ప్రజల్నే కలవడం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట–నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం... ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలని స్వయంగా ఆయనే వెల్లడించారు.

పాదయాత్ర మొదలైన ఆరంభ క్షణాల నుంచే ఆయనలోని మానవత పెల్లుబికింది. ఏప్రిల్‌ 9, మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండ కాస్తోంది. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభా వేదికపైన నీడ కోసం టార్ఫాలిన్‌ కప్పు వేశారు. వేదిక ముందు పోగైన జనంలో అక్కడక్కడ మహిళలు చీర కొంగులతో, మగవాళ్లు తుండు గుడ్డలతో ఎండ నుంచి తలదాచుకునే యత్నం చేస్తున్నారు. ఏ జనం కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్‌ తన యాత్ర ప్రారంభిస్తున్నారో ఆ జనాన్ని పరిశీలిస్తున్న ఆయన కార్యాచరణ అక్కడ్నుంచే మొదలైంది. చురుకైన కార్యకర్తల్ని దగ్గరికి పిలిచి, వేదికపై నాయకులకు నీడగా ఉన్న టార్ఫాలిన్‌ తీసేయించారు. ఎండలోనే సభా కార్యక్రమం సాగింది.

అందుకే ఆయన.. ఇచ్ఛాపురం యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఓ మాటన్నారు. ‘నా ప్రజలకంటే నేను భిన్నమని నేననుకోవటం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకుందామని యాత్ర చేశా. పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధం’ అన్నారు. ఆ మాట అలా రావడం కాకతాళీయమే కావచ్చు! కానీ కడకు అదే జరిగింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది? కడపటి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయా? స్వయంగా పరిశీలిస్తానని రచ్చబండకు ఆకాశమార్గాన బయలుదేరిన జననేత ఇక తిరిగి రాలేదు. పదేళ్లు కావస్తున్నా, ఆయనే గుర్తుకు వస్తున్నారు. తదనంతర కాలంలో ప్రగతి నిలిచిపోయింది. సంక్షేమం పడకెక్కింది. నేటికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో దుర్భర పరిస్థితులు తారాడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కుత్సితమైన రాజకీయాల్ని పాలనతో మిళితం చేసిన దాష్టీకానికి జనం తీవ్రంగా అలమటిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సగటు మనిషీ.. ‘వైఎస్‌ అందించిన పాలన మళ్లీ వస్తే ఎంత బావుండు’  అనుకుంటున్నారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భరోసాను వెతుక్కుంటున్నారు. జనం పట్ల నాయకుడి నిబద్ధత, నాయకుడి పట్ల ప్రజల విశ్వాసమే కొత్త వెలుగు చూపాలి.

చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా..

  • 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం
  • మొత్తం 11 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో యాత్ర
  • 690 గ్రామాల్లో పర్యటన
  • 68 రోజుల పాటు సాగిన ప్రజా ప్రస్థానం
  • 1,475 కిలోమీటర్ల పాటు పాదయాత్ర
  • జూన్‌ 15న ఇచ్ఛాపురంలో ముగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement