నా బిడ్డ మాట ఇస్తే తప్పడు | YS Vijayamma Election Campaign in Nayudupeta | Sakshi
Sakshi News home page

నా బిడ్డ మాట ఇస్తే తప్పడు

Published Mon, Apr 8 2019 4:10 AM | Last Updated on Mon, Apr 8 2019 4:26 AM

YS Vijayamma Election Campaign in Nayudupeta - Sakshi

సాక్షి, తిరుపతి/సాక్షి, నెల్లూరు: ‘నా బిడ్డ జగన్‌బాబు తన తండ్రి రాజశేఖరరెడ్డిలా మాట ఇస్తే తప్పడు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాడు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తాడు’ అని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పే అబద్ధపు హామీలకు మళ్లీ మోసపోకుండా.. వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంత జిల్లా అయిన చిత్తూరుకు సైతం ఇన్నేళ్లుగా ఏమీ చేయని చంద్రబాబు.. ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఓటు వేసే ముందు జగన్‌ కష్టాన్ని, వైఎస్సార్‌ పాలనను గుర్తు తెచ్చుకోవాలని ప్రజల్ని కోరారు. ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..

మేనిఫెస్టోను కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నాడు..
మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయాలి. కానీ ఈరోజు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. 2014లో చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఒక బుక్‌ విడుదల చేశాడు. 650 వాగ్దానాలు, ఐదు సంతకాలు అని చెప్పాడు. ఈ ఐదేళ్లలో అందులో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. దీనిపై ప్రజలు నిలదీస్తారేమోనని భయపడి.. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి ఆ మేనిఫెస్టోనే పూర్తిగా తొలగించేశాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మరో కొత్త బుక్‌ తీసుకొచ్చాడు. ఏటా మే నెలలోనే రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తానని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చాడు. దీన్నే మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఈ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టి.. అన్నదాత సుఖీభవ అంటున్నాడు. జగన్‌ రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తానని పాదయాత్రలో ప్రకటించాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తానని చెబుతున్నాడు. ఇలా వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి పథకాన్నీ చంద్రబాబు కాపీ కొడుతున్నాడు.  చంద్రబాబు తీరును ఒక్కసారి గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మళ్లీ మోసపోవద్దని కోరుతున్నా.

కుప్పం ప్రజలు సైతం వలస పోతున్నారు..
ఎవరైనా సొంత జిల్లాను, ఊరును ప్రేమిస్తారు. కానీ చంద్రబాబును, చిత్తూరు జిల్లాను చూస్తే అలా కనిపించడం లేదు. వేలాది మందికి ఉపాధి లభిస్తుందని.. రాజశేఖరరెడ్డిగారు  మన్నవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. చంద్రబాబు అసమర్థత వల్ల ఈ ప్రాజెక్టు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టును నా భర్త 70 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 30 శాతం పనులను చంద్రబాబు ఇప్పటికీ పూర్తిచేయలేదు. గాలేరు–నగరి పరిస్థితీ అంతే. కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేకపోయారు.  చెరుకు, మామిడి రైతులు గిట్టుబాటు ధరల్లేక.. పంటలు పండించలేక వలసలు పోతున్నారు. అందులో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం ప్రజలే అత్యధిక మంది ఉన్నారు. రాజశేఖరరెడ్డిగారు సత్యవేడు సమీపంలో శ్రీ సిటినీ నెలకొల్పారు. ఈ రోజు ఇక్కడికి 200 ప్రాజెక్టులు వచ్చాయంటే అది వైఎస్సార్‌ ఘనతే.  

2 ఎకరాల నుంచి రూ.లక్ష కోట్లకు ఎదిగిన నువ్వే దోపిడీదారుడివి..
అసలు చంద్రబాబుకు విలువలెక్కడున్నాయి? వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో కొందర్ని సంతల్లో పశువుల్లా కొన్నాడు. కనీసం వారితో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేయించలేదు. చంద్రబాబుకు నేనే సవాల్‌ విసురుతున్నా. రాజధానిలో ఎవరి భూములు ఎంత ఉన్నాయో తేలుద్దాం రండి? నిజాయతీగా రాజకీయాలు చేస్తున్న మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఎక్కడుంది? మేము భూములు పంచే వాళ్లమే గానీ చంద్రబాబులా లాక్కునేవాళ్లం కాదు. మా కుటుంబ సొంత భూములను పేదలకు రాసిచ్చాం. చంద్రబాబు ఒక్క ఎకరమైనా.. ఎవరికైనా ఇచ్చాడా? పైగా నాడు రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు నేడు రూ.లక్షలాది కోట్ల విలువైన ఆస్తి కూడబెట్టాడంటే అర్థం కావట్లేదా.. ఎవరు దోపిడీదారులో? 

కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జగన్‌ ఉన్నాడు..
నాలుగు రోజుల్లో మనం ఓటు వేయబోతున్నాం. ఈ సమయంలో ఒక్కసారి వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. జగన్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతోనే ఉన్నాడు. అన్ని సమస్యలపైనా ఉద్యమించాడు. నెలలో రెండు రోజులు ఇంట్లో ఉంటే మిగతా సమయమంతా ప్రజలతోనే ఉన్నాడు. పాదయాత్రలో జగన్‌ ఎన్నో కష్టాలు విన్నాడు.. చూశాడు. ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ‘నేను ఉన్నాను..’ అని భరోసా ఇస్తున్నాడు. వైఎస్సార్‌లాగానే నా బిడ్డ జగన్‌ కూడా మాట ఇస్తే తప్పడు. జగన్‌ది ఎప్పుడూ ఒంటరి పోరే. మా పొత్తు ప్రజలతో మాత్రమే. ఒక్కసారి జగన్‌కు అవకాశమిచ్చి.. దీవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నా. వైఎస్సార్‌సీపీ విజయంతోనే ప్రత్యేక హోదా సాధ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.  

చంద్రబాబే పెద్ద రౌడీ
చంద్రబాబు ఇష్టారీతిన జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు. మాతో పెట్టుకుంటే ఫినిష్‌ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఆనాడు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని నా భర్తను చంద్రబాబు ఇలాగే బెదిరించాడు.ఆ తర్వాత రెండు, మూడు రోజులకే నా భర్త చనిపోయాడు. జగన్‌ బాబును సైతం.. నీ అంతు చూస్తానంటూ చంద్రబాబు అసెంబ్లీలో బెదిరించాడు. ఇవి చూస్తుంటే తెలియట్లేదా? ఎవరు రౌడీనో. జగన్‌ మీద కేసులున్నాయని.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు.

ఆ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? తునిలో రైలు తగలబెట్టించింది నువ్వు కాదా? రాజధానిలో పంటలు తగలబెట్టించింది నువ్వు కాదా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది నువ్వు కాదా? ఇదంతా చూస్తుంటే ఎవరు రౌడీనో అర్థం కావట్లేదా? చంద్రబాబు మీద 17 కేసులున్నాయి. కానీ దొడ్డిదారిన స్టేలు తెచ్చుకుంటాడు. జగన్‌ మాత్రం తనపై పెట్టిన అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ఎవరిది నిజాయతీనో ప్రజలు ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement