బీసీ గర్జనలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
రాజాం శ్రీకాకుళం : బీసీలతోపాటు వాటి ఉప కులాల పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజాం మండల పరిధి కంచరాం తృప్తి రిసార్ట్ వద్ద రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన బీసీ ఉప కులాలతో బుధవారం బీసీ గర్జన నిర్వహించారు.
వైఎస్‌ఎర్‌సీపీ విజయనగరం పార్లమెంటరీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బొత్స మాట్లాడుతూ మనసున్న మనిషి, ప్రజాభిమాని, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులతో సమానంగా ఆనాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు, ఉప కులాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారని గుర్తు చేశారు.
దేశంలోనే ఇటువంటి చారిత్రక నిర్ణయం ఎక్కడా జరగలేదని, ఇది ఒక చరిత్ర అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు పాలించిన టీడీపీ నేతలకు బీసీలు గుర్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో తొమ్మిదేళ్లు టీడీపీ పరిపాలించిన సమయంలో కేబినేట్‌లో మంత్రులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకటరావులు బీసీలకు ఏమి ఉపకారం చేశారని ప్రశ్నిం చారు.
నిజంగా వీరిద్దరూ బీసీ కులాలకు చెందిన వారేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఆదరణ పేరుతో ఇప్పుడు సబ్బు, మగ్గు, గొర్రె, గిన్నె ఇచ్చి బీసీ ఉప కులాలను మోసం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ కులాలకు, ఉప కులాలకు ఏదో మభ్యపెట్టే పథకాలే తప్ప జీవన ప్రమాణాలు పెంపొందించే సంక్షేమ పథకాలు టీడీపీ ఒక్కసారైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు.
బీసీలు హైకోర్టు జడ్జిలుగా పనికిరారని సీఎం చంద్రబాబు బీసీలపై వివక్ష చూపుతూ తీర్మానాం చేయడాన్ని స్వయంగా జస్టిస్ ఈశ్వరప్ప విమర్శించారని, అప్పుడే చంద్రబాబు నైజం బయటపడిందన్నారు. చిత్తశుద్ధితో, ఆడిన మాటను జవదాటకుండా తండ్రి బాటలో నడుస్తున్న ఘనత వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ ప్రాంతంలో జరిగే సమయంలో బీసీలు, ఉపకులాల సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు ప్రకటించనున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యం: జంగా కృష్ణమూర్తి
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను బీసీ ఉపకులాల భరోసా యాత్రగా మారుస్తామన్నారు. చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదని, బీసీలకు న్యాయం చేస్తున్నట్లు నటిస్తున్నారే తప్ప ఏ ఉపయోగం చేయలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ ఉప కులాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టడంతోపాటు బీసీల కోసం కుల సంక్షేమాలు అమలు చేశారన్నారు.
ప్రస్తుతం బీసీ డిక్లరేషన్ నిమిత్తం జననేత జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పార్లమెంటరీ స్థాయిలోనూ బీసీ గర్జన నిర్వహిస్తున్నారన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమమని, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వీటిని అమలు చేస్తారని పేర్కొన్నారు. పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ బీసీ గర్జన అన్ని బీసీ ఉపకులాలను ఒక తాటిపైకి తెచ్చే కార్యక్రమమన్నారు.
వైఎస్సార్ హాయంలో బీసీల సంక్షేమం అమలు జరిగిందని, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మళ్లీ బీసీ ఉపకులాల సంక్షేమం జరుగనుందన్నారు. పార్టీ నాయకులు పాలవలస రాజశేఖరం, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు, మీసాల నీలకంఠంనాయుడు, శంబంగి చిన్నప్పలనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్, పాలవలస విక్రాంత్, ఎస్‌వీ రమణారావు తదితరులు మాట్లాడుతూ బీసీల సంక్షేమం వైఎస్‌ఆర్‌సీపీతోనే సాధ్యమన్నారు.
బీసీల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్: భూమన
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 144 బలహీన వర్గాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడానికి ఇంతవరకు కమిషన్‌లు వేసే ప్రభుత్వాలనే చూశామన్నారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఆ వర్గాల వద్దకే వెళ్లి వారి సంక్షేమం నిమిత్తం కావలసిన ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లోనూ బీసీ గర్జనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment