
విలేకరులతో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై నిర్వహించిన అఖిలపక్షంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి హాజరైన విజయసాయిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశామన్నారు.
హోదా విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. రైల్వేజోన్ విషయంలో జాప్యం తగదని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని వాగ్దానాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కోరినట్టు తెలిపారు. మేము లేవనెత్తిన అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నోట్ చేసుకున్నారని, ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పూర్తిగా పూడ్చలేదని చెప్పారు. అఖిలపక్షం భేటీలో విజయసాయి రెడ్డితోపాటు టీడీపీ నుంచి తోట నరసింహం, టీఆర్ఎస్ నుంచి కేకే, జితేందర్ రెడ్డి, జాతీయ విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విపక్షాలను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment