
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ‘బి’ ఫామ్‌ల (అభ్యర్థిత్వాలను అధీకృతం చేసే పత్రాలు) పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ చేపట్టింది. 25 లోక్‌సభ, 175 శాసనసభ అభ్యర్థుల ‘బి’ ఫామ్‌లపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే సంతకాలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ సమన్వయకర్తలకు పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్రత్యేక సహాయకుల ద్వారా పంపుతున్నారు. కొందరు అభ్యర్థులు తామే స్వయంగా తీసుకువెళ్లనున్నారు. నామినేషన్ల గడువు ముగియడానికి బాగా ముందుగానే ‘బి’ ఫామ్‌లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఒకట్రెండు రోజుల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా
పార్టీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధాన క్యాంపెయినర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలతో పాటు పార్టీకి ఆకర్షణగా నిలిచే మరికొందరితో ఈ జాబితాను రూపొందించనున్నారు. ఈ నెల 17 నుంచి రోజుకు మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ జగన్ ప్రచార వేడిని రాజేశారు. ఈ నెల 25 తర్వాత రోజుకు నాలుగు సభల్లో ప్రసంగించడం ద్వారా మరింత ఊపు తీసుకురానున్నారు. విజయమ్మ, షర్మిల ఈ నెల 27 నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment