ఢిల్లీలో నేడే ‘వంచనపై గర్జన’ | YSR Congress Party Leaders Vanchana Pai Garjana At Delhi Today | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో నేడే ‘వంచనపై గర్జన’

Published Thu, Dec 27 2018 2:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSR Congress Party Leaders Vanchana Pai Garjana At Delhi Today - Sakshi

ఢిల్లీలో వంచనపై గర్జన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగే ఈ దీక్షలో వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీఎత్తున పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు.  

నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం 
ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని గట్టిగా విశ్వసిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్షను రగిల్చారు. అన్ని వేదికలపై హోదా ఆవశ్యకతను వివరించారు. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పలుమార్లు వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన లోక్‌సభ సభ్యత్వాలను రాజీనామా సమర్పించిన అనంతరం అదే రోజు నుంచి ఏపీ భవన్‌లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు వారి దీక్షలను భగ్నం చేసిన అనంతరం ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఏప్రిల్‌ 29న విశాఖపట్నంలో తొలిసారి   ‘వంచనపై గర్జన’ దీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా జూన్‌ 2న  రెండో గర్జనను నిర్వహించారు. జూలై 3న అనంతపురంలో, ఆగస్టు 9న  గుంటూరులో, నవంబర్‌ 30న కాకినాడలో దీక్షలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పబోతున్నారు. 

హోదా సాధించేదాకా పోరాటం ఆగదు
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2015 ఆగస్టు 10న ఢిల్లీలో పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ధర్నా అనంతరం జగన్‌తో సహా పార్టీ నేతలంతా పార్లమెంట్‌ వైపునకు మార్చ్‌ఫాస్ట్‌ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో జగన్‌ పలుమార్లు భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని వేడుకున్నారు. పలువురు జాతీయ పార్టీల నేతలను కూడా కలుసుకుని విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో 2018 మార్చి 5న వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు ప్రత్యేక హోదాను కోరుతూ మహాధర్నాను నిర్వహించారు. పార్లమెంట్‌లో తుదికంటా పోరాడినా కేంద్రం దిగి రాకపోవడంతో ఎంపీలు తమ రాజీనామాలను సమర్పించారు. 

పది జిల్లాల్లో యువభేరీలు 
ప్రత్యేక హోదా అవసరాన్ని యువకులకు, విద్యార్థులకు వివరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని పది జిల్లా కేంద్రాల్లో యువభేరీలు నిర్వహించారు. దీనికి యువత, విద్యార్థుల నుంచి భారీఎత్తున స్పందన, సంఘీభావం లభించింది. అంతకు ముందు జగన్‌ గుంటూరు వేదికగా హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడమే కాకుండా ప్రత్యేక హోదా ఆకాంక్షను అణచివేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వం అణచివేతకు దిగే కొద్దీ జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేసి హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచడంలో సఫలీకృతం అయ్యారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనని హెచ్చరించిన సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుని హోదా బాట పట్టాల్సి వచ్చింది. 

దీక్షతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. 
ఢిల్లీలో నిర్వహించనున్న ‘వంచనపై గర్జన’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య నేతలు బుధవారం జంతర్‌మంతర్‌ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. 16వ లోక్‌సభకు ప్రస్తుతం జరుగు తున్న చివరి పూర్తిస్థాయి పార్లమెంట్‌ సమావేశాల్లో అయినా కేంద్రం దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా వంచనపై గర్జన దీక్షతో ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఢిల్లీలో విపరీతమైన చలి ఉండడంతో పార్టీ శ్రేణులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని నేతలు సూచించారు.

ధర్మపోరాటం పేరుతో బాబు విన్యాసాలు: మేకపాటి  
బీజేపీతో నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో విన్యాసాలు చేస్తున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ధర్మపోరాటం చేస్తే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ హోదా ఇస్తానంటోందని చెప్పి ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీతో అంటకాగినన్ని రోజులు హోదా అడగకుండా ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో విన్యాసాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మేకపాటి స్పష్టం చేశారు. 

ఏపీకి చంద్రబాబు వెన్నుపోటు: విజయసాయిరెడ్డి 
బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధర్మానికి, అన్యాయానికి, అవినీతికి, అనైతికతకు చంద్రబాబు మారుపేరని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉండి, ప్యాకేజీకి అంగీకరించి, రాష్ట్రానికి హోదా రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ముందు నుంచీ పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని చెప్పారు.  వచ్చే ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినా, బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగినా చంద్రబాబు ఓటమి ఖాయమని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు.  

అవిశ్వాసం పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదే: వైవీ సుబ్బారెడ్డి     
ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు హామీల సాధన కోసం వైఎస్సార్‌సీపీ నాలుగున్నరేళ్లుగా పోరాడుతోందని గుర్తుచేశారు. అంతేకాకుండా తమ పదవులను సైతం త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షకు దిగామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షలు చేశారని, యువభేరి కార్యక్రమాలతో యువతలో చైతన్యం కలిగించారని చెప్పారు. లోక్‌సభకు ఇవే చివరి పూర్తిస్థాయి సమావేశాలు కావడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ దిశగా వంచనపై గర్జన దీక్షతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. 

హోదాకు బాబు అడ్డుపడ్డారు: బొత్స   
29సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి వద్ద ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నించిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు బీజేపీ నేతలను సన్మానించారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాధనకు వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement