పన్నెండు రెండై.. డిపాజిట్లు గల్లంతై! | YSR Congress Party Victory in Anantapur | Sakshi
Sakshi News home page

పన్నెండు రెండై.. డిపాజిట్లు గల్లంతై!

Published Sat, May 25 2019 11:37 AM | Last Updated on Sat, May 25 2019 11:37 AM

YSR Congress Party Victory in Anantapur - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టం ముగిసింది. గెలుపోటములపై అభ్యర్థులు సమీక్షల్లో మునిగిపోయారు. విజేతలు మెజార్టీపై లెక్కలు వేసుకుంటుంటే.. ఓటమిపాలైన అభ్యర్థులు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఉత్కంఠ రేపుతూ శుక్రవారం తెల్లవారుజాము వరకూ సాగిన కౌంటింగ్‌లో ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఇక్కడ 2,135 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. దీంతో 2014 ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో 2 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిస్తే.. వైఎస్సార్‌సీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ దఫా ఎన్నికల్లో 2 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేయగా.. కంచుకోటగా చెప్పుకునే ‘అనంత’లో చావుతప్పి కనున్న లొట్టపోయినట్లు టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.

12 చోట్ల డిపాజిట్లు  కోల్పోయిన కాంగ్రెస్, జనసేన
2014 వరకు జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014 ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. పీసీసీ చీఫ్‌ రఘువీరాకు మినహా మరెవ్వరికీ ఆ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. ఈ దఫా ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన రఘువీరాకు 15.16 శాతం అంటే 28,883 ఓట్లు పోలయ్యాయి. రఘువీరా మినహా కాంగ్రెస్‌ పోటీ చేసిన 12చోట్ల(రాప్తాడులో పోటీలేదు) డిపాజిట్లు కూడా దక్కలేదు. మాజీ మంత్రి శైలజనాథ్‌కు ఘోరంగా ఒక్కశాతం ఓట్లు కూడా పోలవ్వలేదు. కేవలం 1,384 ఓట్లతో 0.69శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. పుట్టపర్తి, కదిరి మినహా తక్కిన 10 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు శైలజనాథ్‌ కంటే ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి 2.19 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది.

జనసేనదీ అదే పరిస్థితి
పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. శింగనమల, మడకశిరలో పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా 19,878 ఓట్లతో 10.39శాతం ఓట్లు సాధించారు. ఇందులో జనసేనపార్టీ కంటే మధుసూదన్‌గుప్తా సామాజికవర్గం, వ్యక్తిగతంగా పోలైన ఓట్లే అధికం. అనంతపురంలో టీసీ వరుణ్‌ 10,920 ఓట్లతో 6.71శాతంతో అతికష్టం మీద డిపాజిట్‌ దక్కించుకున్నారు. ఇక్కడ కూడా పోలైన ఓట్లలో ఓ సామాజిక వర్గానికిచెందిన ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. వీరిద్దరు మినహా ఎక్కడా డిపాజిట్లు రాని పరిస్థితి.

రాజధానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
గెలుపొందిన 12మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజధాని అమరావతికి చేరుకున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి జిల్లాకు చేరుకోనున్నారు. అయితే మంత్రి పదవి ఆశించే ఆశావహుల సంఖ్య వైఎస్సార్‌సీపీలో ఎక్కువగా ఉంది. వీరంతా రాజధానిలో మకాం వేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మెజార్టీ, సామాజికవర్గ సమీకరణాలు, వారు గెలిచిన ప్రత్యర్థులు తదితర అంశాలను తమ అధినేతకు వివరించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విన్నవించే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని వైఎస్‌ జగన్‌ గతంలో ప్రకటించారు. ఈక్రమంలో భవిష్యత్తు పాలన దృష్ట్యా పార్లమెంట్‌కు ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. రెండు పార్లమెంట్లలో ఆరుగురు చొప్పున గెలిచారు. ఒక్కరు చొప్పున రెండు పార్లమెంట్లలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది.

తమ్ముళ్ల పుట్టి మునిగి.. అస్మదీయులు నిండా మునిగి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ భారీగా సాగింది. జిల్లాలో అధికారికంగా ‘సాక్షి’కి వచ్చిన సమాచారం మేరకు దాదాపు రూ.170 కోట్ల బెట్టింగ్‌ జరిగింది. ఇది కాకుండా మరో రూ.50కోట్లకు పైగా బెట్టింగ్‌ జరిగి ఉంటుందని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.220కోట్లు పందెం జరిగినట్లే. ఇందులో టీడీపీ వైపు పందెం కాసిన అభ్యర్థులు పూర్తిగా డీలాపడ్డారు. ముఖ్యంగా సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటిస్తే, లగడపాటి మాత్రమే టీడీపీ వస్తుందని చెప్పారు. టీడీపీకి వంతపాడే కొన్ని పత్రికలు కూడా పేరు తెలియని సర్వే సంస్థల పేరిట టీడీపీ వస్తుందని ప్రకటించారు. ఇవి నమ్మి పందేలు కాసిన వారు రూ.కోట్లు నష్టపోయారు. జిల్లా కేంద్రంలోని ఓ ఎమ్మెల్యే తాను గెలుస్తానని రూ.కోటి పందెం కాశారు. ఓ బట్టలవ్యాపారి మధ్యవర్తిగా పెట్టిన ఈ డబ్బును ఆయన కోల్పోయారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తుందని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన స్నేహితులతో కలిసి రూ.7కోట్లు పందెం కాశారు. ఇదీ కోల్పోయారు. అనంత వెంకట్రామిరెడ్డికి  25వేల మెజార్టీ వస్తుందని ఓ నాయకుడు పందెం కాసి విజయం సాధించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీపై పందెం కాసి నిండా మునిగిపోయారు. రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరంపై భారీగా బెట్టింగ్‌ సాగింది. ఒక్క రాప్తాడు నియోజకవర్గంపైనే రూ.50కోట్లకు పైగా పందెం నడిచింది. అలాగే తాడిపత్రి, ధర్మవరం అసెంబ్లీతో పాటు అనంతపురం పార్లమెంట్‌పై కూడా భారీగా బెట్టింగ్‌ జరిగింది. నాలుగు దశాబ్దాలుగా ఓటమి ఎరుగుని నేతగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌ ఈ విడత బరిలోకి దిగారు. దీంతో పవన్‌ గెలుస్తాడని తాడిపత్రి టీడీపీ నేతలతో పాటు ఇతరులు సుమారురూ.30కోట్ల వరకు భారీగా బెట్టింగ్‌ పెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పవన్‌ గెలుస్తారని ఏకంగా జేసీ దివాకర్‌రెడ్డే రూ.4కోట్ల వరకూ బెట్టింగ్‌ కాసి ఓడిపోయినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement