గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ | YSRC chief writes to guv over probe into attack on him | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని సంస్థలతో దర్యాప్తు జరిపించండి

Published Fri, Nov 2 2018 4:29 AM | Last Updated on Fri, Nov 2 2018 11:30 AM

YSRC chief writes to guv over probe into attack on him - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేని విచారణ సంస్థతో దర్యాప్తు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు.


(గవర్నర్‌కు లేఖ అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు)

తనపై జరిగిన ఈ భీకరమైన హత్యాయత్యాన్ని ముఖ్యమంత్రి, డీజీపీ తక్కువ చేసి మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలతో సాధ్యం కాదన్నారు. ఈమేరకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం గవర్నర్‌ను కలిసి అందజేసింది. లేఖలో వివరాలు..

గౌరవనీయులు గవర్నర్‌ నరసింహన్‌గారికి,
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న ప్రమాదకరమైన పరిణామాలను మీ దృష్టికి తెస్తున్నా. అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులోని  వీఐపీ లాంజ్‌లో మధ్యాహ్నం 12.40 గంటలకు గుర్తు తెలియని దుండగుడు నాపై హత్యాయత్నం చేశాడు. సెల్ఫీ ఫోటో తీసుకోవాలనే నెపంతో నాకు అతి దగ్గరగా వచ్చి మెరుపు వేగంతో పదునైన ఆయుధంతో నా గొంతు కోయాలని ప్రయత్నించాడు.

తక్షణం తేరుకున్న నేను ఆత్మరక్షణ కోసం నా ఎడమ భుజాన్ని అడ్డు పెట్టడంతో ఆ పదునైన ఆయుధం నా భుజంలోకి 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతుకు దిగింది. అనంతరం దుండగుడిని పట్టుకుని అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. విమానాశ్రయంలో డ్యూటీ డాక్టర్‌ నాకు ప్రథమ చికిత్స చేశారు. నాపై జరిగిన హత్యాయత్నం వార్తలు రాష్ట్రంలో తీవ్రమైన పరిణామాలకు దారి తీసే అవకాశాలున్నాయని అంచనా వేశా.

నేను సురక్షితంగా ఉన్నానని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పి వారిని శాంతంగా ఉండేలా  చేయడం నా తక్షణ కర్తవ్యంగా భావించా. వెంటనే రక్తంతో  తడిసిన చొక్కాను అక్కడిక్కడే మార్చుకుని తగినంత మేరకు ప్రథమ చికిత్స చేయించుకుని మరో చొక్కా ధరించి షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం1.05 గంటలకే విమానం ఎక్కి హైదరాబాద్‌ బయలు దేరా. హైదరాబాద్‌ చేరుకున్న తరువాత నన్ను తదుపరి చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు గాయం లోతు పరీక్షించి శస్త్రచికిత్స చేసి 9 కుట్లు వేశారు. ఏవైనా విషపూరిత పదార్థాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి నా రక్త నమూనాలను  పరీక్షలకు పంపారు.  

నాపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు ముందస్తు నిర్థారణ ప్రకారం, లోపభూయిష్టమైన రీతిలో సాగుతోంది. దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగానే విచారణ పూర్తి కాకముందే ఒక అసంపూర్ణమైన ఆలోచనకు వచ్చి ఈ మొత్తం సంఘటన నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్‌ సీపీలో జరిగిన అంతర్గతంగా కుట్రగా చిత్రీకరించింది. నాపై దాడి జరిగిన కొద్ది సేపటికే డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ దుండగుడు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే నాపై దాడి చేసినట్లుగా చెప్పారు.

దాడి పూర్వాపరాలను సరిగ్గా అంచనా వేయకుండా కేవలం టీడీపీ సర్కారు ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి తొందరపాటు ప్రకటన చేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన హత్యాయత్యాన్ని చాలా చిన్నదిగా తగ్గించి చూపే యత్నం జరిగింది. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే ఇదంతా ఒక పథకం ప్రకారం అంతర్గతంగా రూపొందించుకున్నదని, ఎన్నికల్లో సానుభూతి కోసమేనని అధికారులు, టీడీపీ నేతలు పత్రికా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఇది దర్యాప్తు గతిని పూర్తిగా తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో, ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి దుష్ట పన్నాగంతో చేసిందే తప్ప మరొకటి కానే కాదు.

విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నాపైనా, వైఎస్సార్‌సీపీ పైనా చౌకబారు వ్యాఖ్యలు చేశారు. దుండగుడి వద్ద లభించిందని చెబుతున్న లేఖ ద్వారా అతడు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడని వెల్లడైందని, నిందితుడి ఇంట్లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనలు పూర్తిగా నిరాధారమైనవి. డీజీపీ చేసిన వ్యాఖ్యలకు ఇవి మద్దతు చేకూర్చేలా ఉన్నాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణ పూర్తి అనుచితమైన రీతిలో ఒక నిర్థారణకు వచ్చి, ముందుగానే నిర్ణయించుకున్న విధంగా సాగుతోందనేది తేటతెల్లం అవుతోంది.

రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రే దురదృష్టకరమైన రీతిలో  ఈ ఘటన అంతా వైఎస్సార్‌ సీపీ అంతర్గతంగా రచించుకున్న క్రూరమైన పథకమంటూ దర్యాప్తును నీరుగార్చడానికి గట్టి ప్రయత్నమే చేశారు. వైఎస్సార్‌సీపీపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేయాలన్న దురుద్దేశంతో, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయాలన్న కుటిల నీతితో ఇలాంటి ఆరోపణలకు దిగారు. దీన్ని ‘ఆపరేషన్‌ గరుడ’ అంటూ సృష్టించిన ఒక స్క్రిప్టుతో ముడిపెట్టి, రాష్ట్రంలో పరిస్థితులను అస్థిరపరిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌–బీజేపీ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.  

న్యాయసూత్రాల ప్రకారం నిష్పాక్షికమైన విచారణకు బాధితులు అర్హులు. ఏ విచారణ అయినా నిష్పాక్షికంగా, వివక్షకు తావులేకుండా ఉండాలి. సరైన సాక్ష్యాలను సేకరించడం, ముందస్తు నిర్ధారణకు రాకుండా సవ్యమైన దర్యాప్తు  జరపడం నిష్పాక్షిక విచారణలో కీలక అంశాలు. నాపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి నిందితుడికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వద్ద పలు ఆధారాలున్నా కేసును నీరుగార్చే దిశగా విచారణ సాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతున్న తీరు సాధారణ పౌరుల్లోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా జరుగుతున్న ప్రేరేపిత దర్యాప్తుపై తీవ్ర అభ్యంతరాలున్న నేపథ్యంలో మీరు (గవర్నర్‌) తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేని దర్యాప్తు సంస్థకు ఈ కేసు విచారణను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది.’’

భవదీయుడు
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement