జన ప్రభంజనం..      | YSRCP ​​Head YS Jagan Mohan Reddy Election Campaign In Anathapuram | Sakshi
Sakshi News home page

జన ప్రభంజనం..     

Published Fri, Apr 5 2019 8:16 AM | Last Updated on Fri, Apr 5 2019 8:23 AM

YSRCP ​​Head YS Jagan Mohan Reddy Election Campaign In Anathapuram - Sakshi

ప్రసంగిస్తున్న వైఎస్‌ జVýæన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలారి రంగయ్య, ఉషాశ్రీచరణ్, పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షుడు నదీంఅహ్మద్‌

సాక్షి, అనంతపురం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కళ్యాణదుర్గం, హిందూపురం బహిరంగ సభల్లో మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్‌ కళ్యాణదుర్గం చేరుకోవాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన సాయంత్రం 4.40 కళ్యాణదుర్గం చేరుకున్నారు. అయినప్పటికీ జగన్‌ కోసం తరలివచ్చిన వేలాది మంది మండుటెండలోనూ  నడిరోడ్డుపై ఉండిపోయారు. జగన్‌ కన్పించగానే ఈలలు, కేకలతో హోరెత్తించారు. తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి జగన్‌ ప్రసంగించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తే, ఇన్నేళ్లలో టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గానికి సాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

బీటీపీ కాలువ పనులూ నత్తనడకన చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు బీటీపీకి నీళ్లందలేదన్నారు. బీటీపీ కెనాల్‌ కోసం సేకరించిన భూములకు పరిహారం కూడా ఇవ్వలేదంటే రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘హంద్రీ–నీవా’లో పిల్లకాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వలేని అధ్వాన్నపాలన నడుస్తోందన్నారు. కళ్యాణదుర్గంలో టమాట సాగు ఎక్కువని, కిలోకు రూ.3.50 కూడా రావడం లేదన్నారు. కిలోకు రూ.10 నుంచి రూ.12 వచ్చినా రైతుకు గిట్టుబాటు కాదన్నారు. సీజన్‌లో కిలోకు ఒక్కరూపాయి వస్తే ఏం చేయాలో తెలియని రైతులు పంటను రోడ్డుపై పడేస్తున్నారన్నారు. అరటి రేటు కూడా కిలో రూ.7 మించలేదని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. వేరుశనగకు మద్దతు ధర రూ.4,890 ఉంటే, రూ.3 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు.

పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక నియోజవకర్గంలో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 11 మంది మాత్రమే చనిపోయారని చెప్పి, అందులో నలుగురికి మాత్రమే అరకొర పరిహారం ఇచ్చిందని దుయ్యబట్టారు. జిల్లాకు మంచి చేయాలనే ధ్యాస చంద్రబాబుతో పాటు మంత్రి కాలవ శ్రీనివాసులకు లేదని మండిపడ్డారు. వేదవతి నుంచి ఇసుకను తరలించి డబ్బు సంపాదించడంపైనే దృష్టి సారించారన్నారు. కళ్యాణదుర్గంలో రోడ్డు విస్తరణలో కూల్చేసిన భవనాలకు పరిహారం కూడా ఇవ్వలేదంటే... అసలు వీరు మనుషులేనా అని మండిపడ్డారు. ఈ అవినీతి పాలనకు అంతం పలికాలనీ, మార్పునకు ఓటేయాలని కోరారు. ఉషాశ్రీచరణ్‌ను ఎమ్మెల్యేగా, బీసీ అభ్యర్థి బోయ రంగయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. 

‘పురం’ దప్పిక తీర్చిన మహానేత వైఎస్సార్‌: 
35 ఏళ్లుగా హిందూపురం వాసులు టీడీపీ వారినే గెలిపించినా... ఆ ప్రజాప్రతినిధులు ప్రజల దప్పిక తీర్చలేదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.650 కోట్ల వెచ్చించి హిందూపురం వాసుల దాహార్తి తీర్చారన్నారు. అందువల్లే ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్‌ను  తలుచుకుంటున్నారన్నారు. జనాభా పెరిగి తిరిగి... తాగునీటి సమస్య ఏర్పడితే.. గొల్లపల్లి నుంచి తీసుకురావల్సిన కాలవ పనులు కూడా బాలకృష్ణ, చంద్రబాబు పూర్తి చేయలేదని మండిపడ్డారు. బావబామ్మర్దులు షో చేయడం మినహా హిందూపురానికి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.  ‘పురం’ పరిధిలో 99 చెరువులకు నీరిచ్చేందుకు వైఎస్సార్‌ 90 శాతం పనులు పూర్తి చేస్తే తక్కిన 10 శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేదని మండిపడ్డారు.

కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఇండస్ట్రీయల్‌ హబ్‌ పేరుతో బావబామ్మరుదులు శంకుస్థాపన చేశారనీ, కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా..? అని నిలదీశారు. పరిగి సమీపంలోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు అమ్మేశారని గుర్తు చేశారు. ‘పురం’లో 200 పడకల జిల్లా ఆస్పత్రి ఉంటే, అందులో 32 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 10 మంది మాత్రమే ఉన్నారన్నారు. నలుగురు గైనకాలజిçస్టులు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన పాలన ఉంటుందా...? అని ప్రశ్నించారు. గర్భిణులకు సేవ చేసే తీరు ఇదేనా...? అని నిలదీశారు. డిగ్రీ కళాశాల కోసం శ్రీకంఠపురం వద్ద శంకుస్థాపనలు చేశారనీ, మరి ఆ కళాశాల ఏమైందని ప్రశ్నించారు.  ఉర్దూ కళాశాల ఏర్పాటు చేస్తామని దాన్ని కూడా విస్మరించారని దుయ్యబట్టారు.

‘ఇక్కడ చింతపండు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారనీ,  మొదటిరకం క్వింటాలు రూ. 15 వేలు ధర ఉండాలి, కానీ రూ. 10 వేలు కూడా పలకడం లేదన్నారు. రెండోరకం  కనీసం రూ.8 వేలు రావాల్సి ఉన్నా...రూ.5 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పట్టుగూళ్లు బైవోల్టిన్‌ రకం కేజీ రూ. 650 పలకాల్సి ఉండగా.. రూ. 300లకు కూడా అమ్ముకోలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం కేజీకి రూ. 50 చొప్పున ఇస్తానన్న రాయితీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ ప్రభుత్వం రూ. 4 కోట్ల రాయితీ రైతులకు బకాయి పడిందన్నారు. ఇలాంటి అధ్నాన పాలనపై తీర్పు ఇవ్వాలని కోరారు. మార్పునకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోలీసు అధికారులు బరిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్, ఎంపీగా సీఐగా పనిచేసిన మాధవ్‌ను గెలిపించాలన్నారు. వీరిద్దరూ మంచి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ‘అనంత’, పురం పార్లమెంట్‌ అధ్యక్షులు నదీం అహ్మద్, నవీన్‌ నిశ్చల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు.   

1
1/1

కళ్యాణదుర్గం బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement