సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల నిభందనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని వైఎస్సార్ సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి,పూనూరు గౌతం రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే రౌడీ రాజ్యమే అంటూ ఈ నెల 22న విజయనగరం జిల్లా సాలూరులో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అర్బన్ ఫ్యాక్షన్ పార్టీగా అభివర్ణించారు. అది పత్రికలలో ప్రధానంగా ప్రచురించబడింది. ఏదైనా పార్టీలు పలానా పార్టీకి ఓటు వేయవద్దని ఓటర్లను బెదిరించడం వంటివి చేయకూడదు. అలాంటిది చంద్రబాబు సభలో ప్రసంగిస్తూ వైఎస్సార్‌సీపీకి ఓటు వేయవద్దని, కేవలం టీడీపీకి మాత్రమే ఓటు వేయమని కోరారు. అది ఎన్నికల నిబంధన ఉల్లంఘించడమే.
చంద్రబాబు ఈ నెల 22న విశాఖపట్నం జిల్లాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఓటర్లు వైఎస్సార్‌సీపీని ఎంపిక చేసుకుంటే వారి మరణ వాగ్మూలాలు వారే రాసుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. ఇది కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పు. ఈ నెల 21న విశాఖపట్నం జిల్లా గాజువాక ర్యాలీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి అవకాశం ఇస్తే భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది ఓటర్లను బెదిరించడం కిందకు వస్తుంది. వైఎస్ జగన్‌కు ఓటు వేస్తే మోదీకి ఓట్లు వేసినట్టే అంటూ కరపత్రాలు ముద్రించి టీడీపీ పలుచోట్ల పంపిణీ చేస్తోంది. ముస్లిం ఓటర్లలోఅనుమానాలు రేకెత్తించాలనే దురుద్దేశ్యంతో వీటీని పంపిణీ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీ.. వైఎస్ జగన్‌కు మూడిందే’ అంటూ తెలుగుటూడే యూట్యూబ్ ఛానల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఇది ఫేక్ న్యూస్. హలో అనే యాప్ ద్వారా ఫేక్ న్యూస్‌ను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం ఓటర్లను ప్రభావితం చేసినట్లే. ఈ విధంగా చేయడం ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించమే. ఈ ఫిర్యాదులు అన్నింటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment