సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, యూనియన్ ప్రతిని«ధులు వామనరావు, వెంకటేష్, హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు
విశాఖసిటీ: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ భరోసాగా ఉంటుందని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. నగరంలోని హోటల్ బుధిల్‌పార్క్‌లో వైఎస్సార్‌టీయూసీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల మున్సిపల్ యూనియన్ల ప్రతినిధుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నా.. చంద్రబాబు మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారందరి సమస్యలు పరిష్కరించే దిశగా సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఉద్యోగుల్లో సీపీఎస్ విధానంపై వ్యతిరేకత వస్తున్నా.. చంద్రబాబు మాత్రం దాన్ని రద్దు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే రాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడం పట్ల అన్ని వర్గాల ఉద్యోగుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయన్నారు. మున్సిపల్ వ్యవస్థను నిర్వీర్యం చేసి క్రమంగా ప్రైవేట్‌పరం చేసేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌టీయూసీ సమరశంఖం పూరించనుందని ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికను అనుసరించి సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం పనిచేసే వారిపైనే అదనపు భారాన్ని మోపడం అన్యాయమని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ముందు 20 డిమాండ్లు
వైఎస్సార్ మున్సిపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. మున్సిపల్ కార్మికులకు వేతన సవరణ చేయాలని, యూజీడీ కార్మికులకు గమ్‌బూట్లు, గ్లౌజ్‌లు, ఆక్సిజన్ మాస్కులు, సబ్బులు, కొబ్బరి నూనె మొదలైన వస్తువులను జీతంతో పాటు ప్రతి నెలా ఒకటో తేదీన అందించాలని డిమాండ్ చేశారు. జీవో నం.151ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ సమయంలోనే అన్ని బెనిఫిట్స్ ఒకే సారి ఇచ్చేలా సెటిల్‌మెంట్ చేయాలని గౌతంరెడ్డి కోరారు. తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ, విజయవాడలో 010 అమలు చేయాలని, ఫీల్డ్ వర్కర్లకు పెట్రోల్ సౌకర్యం, బస్‌పాస్ ఇవ్వాలనీ, మున్సిపల్ ఎంప్లాయీస్‌కు ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంటీఎస్‌లను తక్షణమే రెగ్యులరైజ్ చేసి టీడీపీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాబోయే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని వర్గాల కార్మికులను ఆదుకుంటుందన్నారు. రోస్టర్ పద్ధతిలో కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా ప్రతి రంగంలోని కార్మికుడి కనీస వేతనం రూ.10 వేలు చేస్తామని ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఒకే ఒక్క సంతకంతో వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు.
వైఎస్సార్ మున్సిపల్ ఫెడరేషన్ ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌టీయూసీ నేతృత్వంలో వైఎస్సార్ మున్సిపల్ ఫెడరేషన్‌ను శనివారం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వైఎస్సార్ మున్సిపల్ ఫెడరేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా గౌతంరెడ్డి, కన్వీనర్‌గా వీవీ వామనరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలోనే మిగిలిన సభ్యులు, ఇతర ప్రతినిధులను ఎన్నుకోనున్నట్లు గౌతంరెడ్డి ప్రకటించారు. వామనరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో పర్యటించి ఫెడరేషన్ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. వైఎస్సార్‌టీయూసీ ఏపీ ఇన్‌చార్జి సత్తారు వెంకటేష్, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల యూనియన్ ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, అనంతపురం జిల్లా ఇన్‌చార్జి ఎం.ఆదినారాయణరెడ్డి, విశాఖ జిల్లా అధ్యక్షుడు బద్రీనాథ్, నిర్వాహక కార్యదర్శి మస్తానప్పతో పాటు యూనియన్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment