సాక్షి, కడప: సిద్ధాంతాలు, విలువలు లేని రాజకీయాల కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఎవరితో కలిసినా వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. జనసేన ను రాజకీయాల్లో పరిగణనలోకి తీసువాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధాంతమని.. ఇదే తమ బలమని చెప్పారు.
నాటి శత్రువులు నేడు మిత్రలయ్యారా..
బీజేపీతో కలిసి పోరాడతాం అని పవన్ కామెడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కమ్యూనిస్టులు పోరాడినంతగా ఏ పార్టీలు చేయలేవని.. అలాంటి పార్టీలను విభేదించి బయటకొచ్చిన ఘనుడు పవన్ అని పేర్కొన్నారు. ‘2014 లో టీడీపీ, బీజేపీ తో పొత్తు అన్నావ్.. 2019 లో కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ లతో పొత్తు పెట్టుకున్నావ్... మళ్ళీ ఇప్పుడు బీజేపీతో జత గట్టావ్... 2019 ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి కాళ్ళు మొక్కి కాబోయే ప్రధాని అన్నావ్.. హోదా విషయంలో పాచిపోయిన లడ్డులు ఇచ్చారన్నవ్.. మళ్ళీ ఏవిధంగా బీజేపీతో కలుస్తారు’ అని రామచంద్రయ్య మండిపడ్డారు. నాడు శత్రువులు.. నేడు మిత్రలయ్యారా అని ప్రశ్నించారు.
ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా విభేదించారు..
ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనను విభేదించి పార్టీకి దూరంగా ఉన్నారని.. దీంతో దిక్కుతోచని స్థితిలో పవన్ ఉన్నారన్నారు. ఇవన్నీ చూస్తోంటే చంద్రబాబు ను పరిరక్షించేందుకు రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుందన్నారు. ఆయన స్థిరత్వం లేకుండా ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పొత్తుల మీద ఉన్న ధ్యాస తన పార్టీని నిర్మాణం చేసుకోవాలన్న దానిపై ఆయనకు లేదన్నారు.
బీజేపీతో ఎలా జతగట్టారు..
చేగువీర ఆశయాల సాధనే లక్ష్యం అనే పవన్.. ఫాసిజం ఉన్న బీజేపీ తో ఎలా జత గట్టారని ప్రశ్నించారు. ఆయన వల్ల బీజేపీ కే నష్టం అని పేర్కొన్నారు. బీజేపీ మన రాష్ట్రంలో మనుగడ కోసం పాకులాడుతుందనేది అందరికి తెలుసునని.. టీడీపీ రాజ్యసభ సభ్యులను ఎందుకు బీజేపీలో కలుపుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా బ్లాక్ డే.. అని, పవన్ వల్ల యువత మోసపోయారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కావాలనుకునే వారు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి సహకారాన్ని అందించాలని రామచంద్రయ్య పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment