మాట్లాడుతున్న అంబటి రాంబాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ నేతలు బీవై రామయ్య, కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి తదితరులు
వెల్దుర్తి: నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అలాగే స్నేహశీలి, ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనతో తన అనుబంధాన్ని తెలియబరిచారు. సోమవారం మండలంలోని చెరుకులపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటితో పాటు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేత శ్రీధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరువెంకటరెడ్డి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డికి ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, నారాయణరెడ్డి సోదరుడు, పార్టీ నేత ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ నారాయణరెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా హత్య చేయించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయన్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసు, నిఘా సంస్థలు చంద్రబాబు సొంత సంస్థల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రికి, హత్యా రాజకీయాలు పెంచి పోషిస్తున్న డిప్యూటీ సీఎంకు.. వారు కాని, వారు కుమారులు కాని, టీడీపీకి చెందిన ఎవరైనా రాబోవు రోజుల్లో డిపాజిట్లు కూడా లేకుండా ‘ఫ్యాను’ గాలికి కొట్టుకుపోతారన్నారు. జలదీక్ష సందర్భంగా జిల్లాకు వచ్చిన తనకు నారాయణరెడ్డితో ఏర్పడిన అనుబంధం, అనురాగాన్ని అంబటి గుర్తు చేసుకున్నారు. నారాయణరెడ్డి కుటుంబానికి, కార్యకర్తలకు పార్టీ చేదోడుగా ఉంటుందన్నారు. తమ నాయకుడి హత్య జరిగినా చెక్కుచెదరకుండా ఆయన కుటుంబానికి ఆసరాగా ఉన్న వేలాది మంది కార్యకర్తల మనోధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు.
టీడీపీ నాయకుల వల్లే హత్యలు, దోపిడీలు, అధికారులపై దాడులు, రాజధాని పేరుతో అవినీతి, పోలవరంలో అక్రమాలు, ప్రమాదాలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై దొంగ దీక్షలు చేస్తున్నారని, ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు తెరదించేలా పత్తకొండలో డిప్యూటీ సీఎంకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకుందన్నారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల పార్టీగా చెప్పుకునే నేటి డూప్లికేట్ టీడీపీ ఆ వర్గాలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. బీసీలకు ఎవరైనా మేలు చేశారు అంటే అది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబీకులే పదవులు ఏలుతున్నారు గానీ ఇతరులకు అవకాశాలిచ్చిందేమీలేదన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మొట్టమొదటగా ప్రకటించిన పార్టీ అభ్యర్థి కంగాటి శ్రీదేవినేనని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుని ఈ సీటును జగనన్నకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కంగాటి శ్రీదేవిని గెలిపించుకోవడం ద్వారా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి ఆశయాలను సాధించుకుందామన్నారు. హత్యా రాజకీయాలకు బెదిరేది లేదని చాటి చెబుదామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంత ఖాయమో, పత్తికొండలో కంగాటి శ్రీదేవి గెలవడం కూడా అంతే ఖాయమన్నారు. కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ హత్యలు, అక్రమాలు, ఇతరులు పదవులు అనుభవించరాదనే నీచమైన ఆలోచనలు కేఈ కుటుంబానివని దుయ్యబట్టారు. తన భర్త నారాయణరెడ్డిని కేఈ కుటుంబం హత్య చేయించి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూసిందని, అయితే..అది సాధ్యం కాలేదని అన్నారు. కార్యకర్తల అండతో నారాయణరెడ్డి ఆశయాలను సాధిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment