
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి
పాతపట్నం: నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం కోసం ఖర్చు చేసిన రూ.వందల కోట్లుతో ఎన్నో గ్రామాలను శాశ్వతంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
చంద్రన్న బాట పేరుతో సిమ్మెంటు రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లు దుర్వినియోగం చేశారని, ఆనేక గ్రామాల్లో వీధిరోడ్లు బాగాలేక ఇప్పటికీ నడవలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దత్తత పేరిట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆధికార పార్టీ నాయకులు హడావుడి చేశారని, ఇప్పుడు ఆయా గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ప్రజల బాగుకోసం, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం తపించే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటుతో టీడీపీకి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.