అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతీ సమావేశంలో తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మా వాడు అని సంభోదిస్తున్నారని, ఆయన మా నాయకుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య అన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన ధర్మపోరాటం సభలో ఎంపీ జేసీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచించిన చంద్రబాబు స్వార్థ రాజకీయాలను ఎండగడుతూ, అధికార పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్న యోధుడు తమ నేత అన్నారు.
ప్రతీ సమావేశంలో చంద్రబాబు భజన చేయడం మానుకొని జిల్లా ప్రయోజనాలు, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. వయస్సుకు తగినట్లు నడుచుకోవాలని, ప్రజాభిమానం కలిగిన నేతలనుద్దేశించి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోకపోతే జనమే తగిన బుద్ధి చెబుతారన్నారు. సీనియర్ రాజకీయ నాయకునిగా హుందాతనం ప్రదర్శించాలే కానీ, సీఎం మెప్పు కోసం ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. మీ మాట తీరును అన్నివర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బీటీ ప్రాజెక్టును చూసి సంజీవరెడ్డి ఆత్మ సంతోషిస్తుందా? మీకు అక్కడ నీళ్లు కనిపించాయా? అని ప్రశ్నించారు. జిల్లాలో కరువు విళయతాండవం చేస్తుంటే బ్రహ్మాండం బద్దలైనట్లుగా చెప్పుకోవడాన్ని ప్రజలే ఛీ కొడుతున్నారన్నారు. మీ మాటలు పిచ్చికి పరాకాష్టగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment