కర్త, కర్మ, క్రియ చంద్రబాబే | YSRCP Leaders Says Chandrababu Conspiracy In Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

కర్త, కర్మ, క్రియ చంద్రబాబే

Published Wed, Nov 14 2018 3:50 AM | Last Updated on Wed, Nov 14 2018 10:34 AM

YSRCP Leaders Says Chandrababu Conspiracy In Murder Attempt On YS Jagan  - Sakshi

ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు మేకపాటి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి, వరప్రసాద్, వేమిరెడ్డి, అవినాష్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని, ఈ కుట్రలో ఆయనే కర్త, కర్మ, క్రియా అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రతో వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర చేశారని వారు ఆరోపించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు పెద్దలు భాగం కాబట్టి వారు జరిపే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే నిజాలు బయటకొస్తాన్నారు. ఇదే విషయమై శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ లోక్‌సభ పక్షనేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాష్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో దోషులు ఎవరన్నది తేలాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను పార్టీ నేతలు రాష్ట్రపతికి అందజేశారు. దీనిపై రామ్‌నాథ్‌ కోవింద్‌ సానుకూలంగా స్పందించినట్టు నేతలు మీడియాకు వెల్లడించారు. వారు ఇంకా ఏమన్నారంటే...

కుట్ర చేయకపోతే మీరే స్వతంత్ర దర్యాప్తు కోరండి
వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో ప్రధాన సూత్రధారుడు, కుట్రదారులు ఏదో ఒక రోజు జైలుకెళ్లక తప్పదు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి, కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయనతోపాటు రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకుర్, మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, డ్రామా ఆర్టిస్ట్‌ శివాజీ, టీడీపీ నేత హర్షవర్ధన్‌ ఈ కుట్రలో భాగస్వామ్యులు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే నిజాలన్ని బయటపడతాయి. ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తరువాతైనా దోషులు జైలుకెళ్లక తప్పుదు. ఇక రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా చంద్రబాబు ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. రాజ్యాంగంలోని అధికరణ 164(4) ప్రకారం కొత్తగా బాధ్యతులు స్వీకరించిన మంత్రి ఆరునెలల్లో చట్టసభలకు ఎన్నికవ్వాలి. లేకుంటే మంత్రి వర్గం నుంచి తొలగించాలి. కానీ ఏపీలో అరునెలల్లో మళ్లీ చట్టసభకు ఎన్నికయ్యే పరిస్థితి లేదని తెలిసి కూడా కొత్తగా మంత్రివర్గంలోకి ఒకరికి స్థానం కల్పించిన చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.
 – విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత

హత్యాయత్నం పెద్దల కుట్ర..
వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్ర వెనుకు పెద్దల హస్తం ఉంది. ప్రతిపక్ష నేతను అంతమొందించాలన్నది దుర్మార్గమైన ఆలోచన. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు ఆస్కారం లేదు. దీని వెనకున్న దోషులెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో కేంద్ర సంస్థతో నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. దోషులందరూ త్వరలోనే బయటపడతారు.
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ

కేసును నీరుగార్చే ప్రయత్నాలను రాష్ట్రపతికి వివరించాం
వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని పక్కదారి పట్టించేందుకు ముఖ్యంత్రి చంద్రబాబు, డీజీపీ చేసిన ప్రయత్నాలను రాష్ట్రపతికి వివరించాం. వైఎస్‌ జగన్‌ హత్యకు పక్కా పథకం ప్రకారం విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత హర్షవర్ధన్‌కు చెందిన క్యాంటిన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావుతో కుట్ర చేశారు. కేవలం ఒక్క నెల మాత్రమే విమానాశ్రయంలో పనిచేసేందుకు అనుమతి ఉన్న నిందితుడు శ్రీనివాసరావును మూడు, నాలుగు నెలలుగా ఎలా లోపలికి అనుమతించారు? విమానాశ్రయంలోకి కత్తి ఎలా అనుమతించారు? అన్న విషయాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తుతోనే అది సాధ్యం.  
–వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ

నిందితుడిని ఎవరు అనుమతించారు?
బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆఫ్‌ సెక్యూరిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేని నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు ఎలా చేరుకున్నాడు. అనుమతి ఎవరిచ్చారు అన్నది తేలాలి. ఈ హత్యాయత్నం ఘటనలో కుట్ర ఉందని చెబితే కుట్రదారులను విచారించాల్సి వస్తుందని కేసును క్రుట కోణంలో విచారించడం లేదు. నిందితుడు టీడీపీ వ్యక్తి అని ఒక మాజీ ఎంపీ పేర్కొన్నారు. నిందితుడి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటి వరకు రోడ్డు వేయించారని చెప్పారు.  
– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనమండలి ప్రతిపక్షనేత 

రాష్ట్ర ప్రభుత్వ విచారణతో నిజలు బయటకురావు
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారిస్తే నిజాలు బయటకురావని తేలిపోయింది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. ఈ కేసులో అసలు కుట్రదారులు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని కోరాం. 
– వరప్రసాదరావు, మాజీ ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement