సాక్షి, నెల్లూరు : బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సభకు జనం రాలేదని, అట్టర్ ఫ్లాఫ్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అలా అంటే జనాలు నవ్వుతారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు మద్దతుగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని, 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ సీఎం అయితేనే టీడీపీ హయాంలో దగాపడ్డ బీసీ సోదరులంతా లాభపడుతారన్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ.. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదన్నారు. వారి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేశారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల స్థితిగతులను మారుస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున మొత్తం ఐదేళ్లలో రూ. 75వేల కోట్లను బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని నిన్నటి సభలో తమ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారని తెలిపారు.
బీసీల్లోని ప్రతికులంతో రాజకీయం చేసిన టీడీపీ గత ఐదేళ్లలో ఏ ఒక్క కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేయలేదని, కానీ జగన్ అధికారంలోకి వస్తే 139 ఉపకులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారని గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, అధికారంలోకి రాగానే ఈ పథకానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారనీ, జడ్జిలుగా బీసీలు పనికి రారని లేఖలు రాశారన్నారు. నామినేటడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అవకాశం కల్పించేలా చట్టబద్దత చేస్తామని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment