సాక్షి, విజయనగరం : ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ కేవలం ఎన్నికల బడ్జెట్టేనని, విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల ఇస్తామన్న ప్రభుత్వం... ఈసారి కూడా మొండిచేయి చూపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులేదు అంటున్న చంద్రబాబు.. సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆర్థికాభివృద్ధి చెందామంటూనే బడ్జెట్‌లో లోటు ఎలా చూపిస్తారని నిలదీశారు.
ఓట్లు దండుకోడానికే ఊహాజనిత నిధులు వస్తాయని బడ్జెట్‌లో ప్రకటించారని, బాబు హయాంలో సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని విమర్శించారు. వడ్డీరూపంలో వేలాది రూపాయిలు నష్టపోయిన డ్వాక్రా మహిళలు ఇప్పుడు ఇస్తున్న పదివేలతో సంతృప్తిగా లేరని అన్నారు. ఏ అధికార హోదా లేని, ప్రజాప్రతినిధులు కాని అధికార పార్టీ నాయకులు చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబు ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమల్లో ప్రజాప్రతినిధులే పాల్గొనేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment