సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చింతకాయల సన్యాసిపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడైన సన్యాసిపాత్రుడు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరానని, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషమని, నర్సీపట్నంలో పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
పవన్ టీడీపీ దత్త పుత్రుడు
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీ పట్ల ప్రజావిశ్వాసం లేదని, అందుకే పార్టీలోకి నేతలు వలసలు వస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. పవన్‌ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్ అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ నడుస్తాడనుకున్నా.. కానీ సినిమా ఫక్కీలో అందర్నీ నడిపించి ఆయన మాత్రం కారుపై ఎక్కాడని ఎద్దేవా చేశారు. పవన్ టీడీపీ దత్తపుత్రుడని, చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ యాక్షన్ అని వ్యంగ్యంగా విమర్శించారు. పవన్ జీవితాన్ని చంద్రబాబుకు అర్పించాడని, లైఫ్ టైమ్ కాల్ షీట్స్ బాబుకు ఇచ్చేశాడని అన్నారు. పవన్ కల్యాణ్‌తో ప్రజలకు ఉపయోగం లేదని, ఆయన ఢిల్లీ నేతలను కలిసినా, అమెరికా అధ్యక్షున్ని కలిసి మాట్లాడినా ప్రజలు నమ్మరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. అయిదేళ్లలో చేయాల్సిన అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్ అయిదు నెలల్లో చేశారని ప్రస్తావించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి అద్భుతమైన పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment