వైఎస్సార్ సీపీ ఎంపీల ఆమరణ దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2:02 గంటలకు దీక్ష ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ‘ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాల’నే నినాదాలు హోరెత్తాయి.
అమరుల సాక్షిగా: దీక్షలో కూర్చోవడానికి ముందు.. ఏపీ భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులు మునికోటి, రమణయ్య, లక్ష్మయ్య,ఉదయభాను, లోకేశ్వరరావులకు చిత్రపటాలపై పూలుచల్లి నివాళులు అర్పించారు. అటుపై మహానేత వైఎస్సార్ చిత్రపటానికి నమస్కరించారు.
ఉత్తరాంధ్ర చర్చా వేదిక మద్దతు
విభజన హామీలు అమలు కోసం వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు చేసిన రాజీనామాలను స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు. ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment