ట్రిపుల్‌ ధమాకా | YSRCP MPs Profiles Special Story West Godavari | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ధమాకా

Published Sat, Jun 8 2019 10:08 AM | Last Updated on Sat, Jun 8 2019 10:08 AM

YSRCP MPs Profiles Special Story West Godavari - Sakshi

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఏలూరు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి  తన మంత్రివర్గంలో జిల్లాకు మంచి ప్రాధాన్యం కల్పించారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు కల్పించడం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెప్పారు. మంత్రి పదవులు లభించనున్న ముగ్గురూ సీనియర్లే కావడం గమనార్హం. ఏలూరు ఎమ్మెల్యేఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వీరు శనివారం సచివాలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2014లో ఒక్క సీటు కూడా లేని స్థితి నుంచి ఏకంగా 13 సీట్లు కట్టబెట్టిన జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. పదవుల్లో కూడా సామాజిక న్యాయం పాటించారు. ఒకటి కాపు, ఒకటి క్షత్రియ,మరోటి ఎస్సీలకు కట్టబెట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో ఐదుగురికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నానని, మంత్రులలో కూడా 90 శాతం మందిని రెండున్నర ఏళ్ల తర్వాత మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. అందరికీ న్యాయం చేస్తానని, మంత్రి పదవిని హోదాలా కాకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఇద్దరు మంత్రులను ఓడించిన ఘనత
జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంచి వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ లీడర్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు. 2004 నుంచి 2009 వరకూ అత్తిలి శాసన సభ్యునిగా పనిచేశారు. అప్పటి రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించారు. 2019 ఎన్నికలలో ఆచంట నుంచి పోటీ చేసి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణను 12,886 ఓట్ల తేడాతో ఓడించారు. ఇద్దరు మంత్రులను ఓడించిన ఘనత శ్రీంగనాథరాజుకి దక్కింది. గత 24 సంవత్సరాలుగా జిల్లా రైసుమిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా కొనసాగి, ప్రస్తుతం జిల్లా గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. జిల్లా రైసుమిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం, ట్రస్టు ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులకు ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు, రాయితీపై వైద్య పరీక్షలు, యండగండిలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన డీఎన్‌ఆర్‌ కళాశాలకు అధ్యక్షునిగా పనిచేశారు.

వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం 
ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఏలూరు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆళ్ల నాని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా మారారు. అనంతరం 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2016 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 2017వ సంవత్సరంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ స్థానం సంపాదించుకున్నారు. ఇంకా నాలుగున్నర ఏళ్ల పదవీ కాలం ఉన్నా, జగన్‌ ఆదేశాల మేరకు 2019లో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. జిల్లాలో పార్టీకి మళ్లీ ఊపు తేవడంతో ఆళ్ల నాని ప్రముఖ పాత్ర వహించారు.

ఇసుక, మద్యం మాఫియాపై పోరు
తానేటి వనిత 2009లో శాసనసభకు తెలుగుదేశం తరపున గోపాలపురం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. 2014లో కొవ్వూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చి 2019లో మంచి మెజారిటీతో గెలుపొందారు.  విద్యాధికురాలైన వనిత గత ఐదేళ్లుగా ఇసుక, మద్యం మాఫియాపై అలుపెరుగని పోరాటం చేశారు. వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు కూడా రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు.  

అందరివాడు 
ఏలూరు (టూటౌన్‌): వివాద రహితుడు, సౌమ్యుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి రాష్ట్ర కేబినెట్‌లో చోటు లభించింది. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల నాని మాటల కన్నా చేతల మనిషి అనే పేరును సంపాదించుకున్నారు.  ఏలూరు నగర అభివృద్ధి జరిగిందంటే అది ఆళ్ల నాని ఎమ్మెల్యేగా పనిచేసిన 10 ఏళ్ల కాలంలోనే అనేది జగమెరిగిన సత్యం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఓటమి చెందారు.  విధేయతకు పెద్ద పీట వేసిన వైఎస్‌ జగన్‌ ఆళ్ల నానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌గానూ, అనంతరం ఏలూరు పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గానూ ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జిపై గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి జిల్లా నుంచి ఆళ్ల నానికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు అనుగుణంగానే  ఆళ్ల నానికి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో మంత్రి స్థానం దక్కింది. 

నాని హయాంలోనే ఏలూరు అభివృద్ధి
ఎమ్మెల్యే ఆళ్ల నాని గతంలో పనిచేసిన సమయంలోనే ఏలూరు అభివృద్ధి జరిగింది. ఆయన హయాంలోనే ఏలూరు మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థ హోదా లభించింది. గోదావరి జలాలను నగర ప్రజలకు అందించాలనే సంకల్పంతో దెందులూరు సమీపంలో వంద ఎకరాలను సేకరించి మంచినీటి చెరువును తవ్వించారు. అప్పటి వరకూ కృష్ణా జలాలు మాత్రమే ఏలూరుకు తాగునీటిని అందించేవి. ఇప్పుడు గోదావరి జలాలే ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నాడు నాని ముందు చూపు కారణంగానే నేడు ఏలూరు ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా ఉందనేది ప్రజలు చెబుతున్నారు. ఏలూరు నగరంలోని నిరుపేదలకు సొంత గూడును కల్పించిన ఘనత ఎమ్మెల్యే ఆళ్ల నానిదే. ఆయన హయాంలోనే పోణంగిలోని వైఎస్సార్‌ కాలనీ, వంగాయగూడెం, కొత్తూరులలో ఇళ్ల కాలనీలు ఏర్పడ్డాయి. 5 వేల మందికి పైగా పేదలకు పక్కా ఇళ్లు అందించారు. నాని తమ్మిలేరు నుంచి నగరానికి వరద ముంపు బాధ తప్పించారు. ఆయన హయాంలో సుమారు రూ.30 కోట్లతో తమ్మిలేరుకు రివిట్‌మెంట్లు, రక్షణగోడను నిర్మించారు. నగరంలోని పాత బస్టాండ్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సైతం ఆళ్ల నాని హయాంలోనే ప్రారంభించారు. నానికి కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వనితకు వరమాల
కొవ్వూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనితకి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైన ఘనత దక్కించుకున్నారు. శనివారం ఏ శాఖ కేటాయించారో వెల్లడించనున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరు నుంచి ఆమె 25,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఏఏ అజీజ్‌ అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గం పునర్విభజన అనంతరం గత ఎన్నికల్లో గెలుపొందిన కేఎస్‌ జవహర్‌కి రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా వ్యవహరించారు. మూడో మంత్రిగా ఇప్పుడు తానేటి వనిత అవకాశం దక్కించుకున్నారు. 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తిరిగిపల్లి ఉషారాణిపై సుమారు 14 వేల ఓట్ల మెజార్టీతో వనిత గెలుపొందారు. 2012లో ఎమ్మెల్యే పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిని చవిచూసినప్పటికీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ విధేయురాలిగా ఉంటూ అంకితభావంతో పనిచేయడంతో ఈ ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ముప్పై ఏళ్ల కాలంలో ఏ ఎమ్మెల్యేకి దక్కని భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడుతున్న రెండో ప్రభుత్వంలో వనిత అమాత్యురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి
ఆచంట : ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కేబినెట్‌లో స్థానం లభించడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సర్వత్రా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై 12,886 తేడాతో ఓడించి రికార్డు సృష్టించి  తెలుగుదేశం కంచుకోటలో పాగా వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్‌లో బెర్తు ఖరారు చేశారు. 2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన శ్రీరంగనాథరాజు అప్పటి మంత్రి, రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించి సంచలనం సృష్టించారు. నేడు మళ్లీ ఆచంట నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాష్ట్ర మంత్రిగా సుదర్ఘీకాలం పాటు పనిచేసిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను ఓడించి మరోసారి రికార్డు సృష్టించారు. ఇలా జిల్లాలో ఉద్దండులైన ఇద్దరు మంత్రులను మట్టి కరిపించిన ఘనత శ్రీరంగనాథరాజుకే దక్కించుకుని మంత్రివర్గంలో స్థానం సాధించారు. శ్రీరంగనాథరాజుకు రాజకీయ చతురుడిగా, వ్యూహకర్తగా, సామాజిక సేవాతత్పరుడిగా శ్రీరంగనాథరాజుకు జిల్లాలో మంచిపేరు ఉంది.

ఆచంటకు ముచ్చటగా మూడో మంత్రి పదవి
ఆచంట నియోజకవర్గానికి ఇప్పటివరకూ మూడు సార్లు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం దక్కింది. 1967లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాసరి పెరుమాళ్లుకు తొలిసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి, 2014లో టీడీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ మంత్రి పదవులు పొందారు. మళ్లీ నేడు ఓసీ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆచంటకు వెను వెంటనే మళ్లీ మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అనతికాలంలోనే ఆచంట మా‘రాజు’
గతేడాది మే నెలలో శ్రీరంగనాథరాజు వైఎస్సార్‌ సీపీలో చేరారు. జూన్‌ 2, 3 తేదీల్లో నియోజకవర్గంలో సాగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. నాటి నుంచి నేటి వరకూ నియోజకకవర్గంలో పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ఒక పక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, మరో పక్క సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. లంక గ్రామమైన అయోధ్యలంకను దత్తత తీసుకుని లక్షలాది రూపాయిల సొంత ఖర్చుతో రక్షిత మంచినీటి పథకం, రహదారులు, విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేశారు. ఇదే విధంగా ఆచంట నుంచి విద్యార్థుల సౌకర్యార్థం పెనుగొండ ఎస్‌వీకెపీ కళాశాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి ప్రతి శనివారం, సోమవారం ఉచిత బస్సు సౌకర్యంతోపాటు, వైద్య పరీక్షల్లో రాయితీ సౌకర్యం కల్పించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ఇంటింట సర్వే చేయించి ఆయా సమస్యల పరిష్కారం చేస్తానంటూ హామీ పత్రాలు ఇచ్చి ప్రజల మెప్పు పొందారు. నియోజకవర్గంలోని తూర్పుపాలెంలో స్థిర నివాసం, పార్టీ కార్యాలయం నిర్మించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇలా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువై అనూహ్య విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement