వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల నాలుగో రోజు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి. చిత్రంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానర్సింహం, రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, భూమన కరుణాకరరెడ్డి తదితరులు
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన బూత్‌స్థాయి కన్వీనర్‌లకు ఇచ్చిన రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. నాలుగురోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జిల్లాలో పార్టీకి దశ, దిశ నిర్దేశం చేస్తున్న నేతలుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయపరచుకుని పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపై నిలిపి శిక్షణ తరగతులను విజయవంతం చేశారు.
పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్ధసారథి వంటి రాష్ట్ర పెద్దలను ఈ తరగతులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారితో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ఇప్పించి దిశా నిర్ధేశం చేశారు. పార్టీ ఆవిర్భావం, భావజాలం, రాజన్న పాలనపై పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులను తన్మయం చేసింది. ప్రధానంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి బూత్‌స్థాయి కన్వీనర్‌లు, సభ్యుల పాత్ర కీలకమని, ఇందుకు గాను వారికి పూర్తిస్థాయిలో ఎన్నికల విధులు, ఓటు ప్రాధాన్యత, ఓటరును ఏవిధంగా బూత్‌స్థాయి వరకూ తీసకురావాలి తదితర అంశాలపై పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుచే ఇప్పించిన శిక్షణ తరగతులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment