సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ.. ప్రజా సంక్షేమమే ఊపిరిగా అవిశ్రాంత పోరాటాలు కొనసాగిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సప్త వర్షాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడుతోంది. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అనతి కాలంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత సంక్షోభాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పుట్టిన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని వ్యతిరేక శక్తులు చేసిన కుట్రలేవీ ఫలించలేదు. పార్టీని స్థాపించేటప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు.
ఉప ఎన్నికల్లో చారిత్రక ఘట్టం
కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే బలంతో ప్రస్థానం సాగించిన వైఎస్సార్‌సీపీ ఇంతింతై... వటుడింతై అన్నట్లుగా పైకి ఎదిగింది. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో 17 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. పార్టీ ఆరంభంలోనే జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్లు, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి విజయమ్మ 81,373 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎన్నికై యావత్ దేశంలోనే మరపురాని ఒక చరిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత కొంతకాలానికి జరిగిన ఉప ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే స్థానాలను, మరో ఎంపీ స్థానాన్ని (నెల్లూరు)ను వైఎస్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకుంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనా, 67 సీట్లతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది.
పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు
ప్రజల తీర్పును శిరసావహిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారు. తన వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీల బలంతోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల తరపున అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ కావడం గమనార్హం.
జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు
ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న యోధుడు జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలన్న కొందరి ప్రయత్నాలు ఫలించలేదని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన కుట్రలు సాగలేదని చెప్పారు. పార్టీకి పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో జగన్ మరింత రాటుతేలారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని, వైఎస్సార్‌సీపీకి ఇక రానున్నవి మంచి రోజులేనని స్పష్టం చేశారు.
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోమవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, అన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పిలుపునిచ్చింది.
ప్రజా సంక్షేమమే ఊపిరి
Published Mon, Mar 12 2018 1:34 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment