వంచనపై గర్జన: ‘ప్రజలను నడిరోడ్డుపై పడేశారు’ | YSRCP Vanchana Pai Garjana Deeksha Starts In Delhi | Sakshi
Sakshi News home page

‘ఏపీ నష్టపోవడానికి చంద్రబాబే కారణం’

Dec 27 2018 10:18 AM | Updated on Dec 27 2018 12:25 PM

YSRCP Vanchana Pai Garjana Deeksha Starts In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.  ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ ఈ దీక్ష చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ.. హోదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది. అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్‌సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి.. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు.

దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ దీక్షలో వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురువారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుంది
వైఎస్సార్‌ సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూ టర్న్‌ తీసుకుని ఏపీ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుందని తెలిపారు. హోదా కోసమే వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా జననేత వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలను నడిరోడ్డుపై పడేశారు
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన బీజేపీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ప్రజలను నడిరోడ్డున పడివేసి ఎవరి దారి వారు చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై చంద్రబాబు ఎప్పుడో చేతులెత్తేసి.. ప్రస్తుతం కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లతో ప్రజలకు ఏ మాత్రం లాభం లేదని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైఎస్సార్‌ సీపీనే అని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన చంద్రబాబు నేడు అదే పార్టీతో కలిశారని ఎద్దేవా చేశారు. హోదా కోసం వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారని.. అందరం కలిసి రాజీనామాలు చేద్దామంటే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. టీడీపీ నేతలు దమ్ముంటే తమతో కలిసి రావాలని.. మోదీ ఇంటి వద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. 


వైఎస్సార్‌ హయంలోనే పోలవరం పనులు ప్రారంభం
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలోనే పోలవరం పనులు ప్రారంభించారని.. ఆయన చలువ వల్లే అసలు పోలవరానికి రూపం వచ్చిందని గుర్తుచేశారు.  కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం కడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం ఏ పార్టీతోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాన చేస్తున్నారని తెలిపారు. అల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెరగడానికి కూడా చంద్రబాబే కారణమని అన్నారు.

కమీషన్ల కోసమే పోలవరం చేపట్టారు..
వంచనపై గర్జన దీక్షలో వైఎస్సార్‌ సీపీ నాయకులు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చేపట్టాడని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఏపీ అన్ని రకాల నష్టపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాజన్న రాజ్యం కావాలంటే అది వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. 

చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు
దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతుల వలసల గురించి చంద్రబాబు చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు హోదా కోసం ఉభయ సభల్లో పోరాడారని అన్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అనేక రూపాల్లో పోరాటాలు చేశారని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement