సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వైఎస్ జగన్ మీద ఉన్న కేసులు ఎలా పెట్టారో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. అక్రమ కేసులను వైఎస్ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తనపై ఉన్న ఒక్క కేసులకు స్టేలు తెచ్చుకుని బతుకుతున్నారని మండిపడ్డారు. ‘ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది తాను కాదని ఒక్కసారైనా బయటికి వచ్చి చెప్పారా. కేసు అనగానే స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయనను స్టేల బాబు అని పిలిస్తేనే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్సులు పెట్టి మరీ టీడీపీ నేతలకు వైఎస్ జగన్‌ను తిట్టాలి అని చెబుతున్నారే తప్ప .. తానేం అభివృద్ధి చేశారో ప్రజలకు మాత్రం చెప్పట్లేదని విమర్శించారు.
మరి ఆ 21 మంది సంగతేంటి?
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ‘కేసుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఆయన దొంగలకే పెద్ద దొంగ. ఇక టీడీపీ అభ్యర్థులు 21 మందిపై కేసులు ఉన్నాయి. మీ బినామీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఎలా సంపాదించారో, ఎన్ని కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారో చంద్రబాబుకు తెలియదా. రాయపాటి, గంటా అక్రమంగా ఎంత సంపాదించారు.. ఎన్ని భూములు కబ్జా చేశారు. బోండా ఉమా ఒక ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకున్నారు. బడేటి బుజ్జి ఎన్ని భూములను తిన్నారు. యరపతినేని మైనింగ్ మాఫియాను ఎలా ప్రోత్సహిస్తున్నారు అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
వందల మంది దొంగలకు నాయకుడైన చంద్రబాబు.. ప్రజా క్షేత్రంలో ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు కేసులు ఎదుర్కొంటున్న 21 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లు ఆమె వెల్లడించారు. చింతమనేని ప్రభాకర్ , గంటా శ్రీనివాస రావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, కోడెల శివప్రసాద రావు, కాలువ శ్రీనివాసులు, బోండా ఉమా, పల్లె రఘునాథ రెడ్డి, అచ్చెంనాయుడు, కోన రవికుమార్, సబ్బం హరి, నక్కా ఆనందబాబు, కరణం బలరాం, సతీశ్ కుమార్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, జితేందర్ గౌడ్, బాలకృష్ణ, బీకే పార్థసారథి, వెంకట శివమారమరాజు, మాగంటి వెంకటేశ్వర రావు, నిమ్మల కిష్టప్ప తదితరులపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో తాయిలాలు ఇస్తున్నారు. పసుపు కుంకుమ ఇచ్చి మహిళల మంగళ సూత్రం మీద ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటున్నారు. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ ఇవ్వకుండా మోసం చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ఇలా క్రిమిమల్ మైండ్ ఉండటం రాష్ట్రానికి నష్టం అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment