సాక్షి, హైదరాబాద్ : ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఈసీకి వ్యతిరేకంగా జీవో ఇచ్చి చంద్రబాబు సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు. ‘ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. సీఈసీని విమర్శించిన తీరు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈసీ ఆదేశాలకు చంద్రబాబు అడ్డుపడినా ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. అలాగే చంద్రబాబుకు ఇది ఘోర అవమానం’ అని ఆమె పేర్కొన్నారు.(చదవండి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు)
ఈ క్రమంలో ఈసీ అధికారులను బదిలీ చేస్తే పెద్ద రాజకీయ కుట్రగా చంద్రబాబు చిత్రీకరించారు.. ఇందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాగా ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment