
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే స్థాయి మరచి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీని నేరగాళ్ల పార్టీ అంటున్న చంద్రబాబు.. తమ అభ్యర్థుల జాబితాలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ‘ చంద్రబాబు నువ్వు నేరగాడివి. నువ్వు, నీ కొడుకు కలిసి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మీ అభ్యర్థి చింతమనేని పుణ్య పురుషుడా. ఇక నిడదవోలు ఎమ్మెల్యే 400 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా అమ్ముకున్నాడు. బోండా ఉమా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఉన్నాడు. నారాయణ కాలేజీలో ఎంత మంది చనిపోయారు. దానిపై చర్చ ఎందుకు జరగడం లేదు’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
అభ్యర్థులు కూడా దొరకడం లేదు..
కోట్లు కుమ్మరించి అడ్డదారిలో టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రశాంత్ కిషోర్‌ను బిహార్ గ్యాంగ్ అనడం దారుణం. సీఎం స్థానానికి చంద్రబాబు అనర్హుడు. ఆయనకు ఓటమి తప్పదని అర్థం అయ్యింది. అందుకే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పక్కన ఎవరున్నా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు మానసిక స్థితి చూసి వాళ్ల పార్టీ అభ్యర్థులు పోటీకి దూరంగా ఉంటున్నారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment