
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. వైఎస్సార్ సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. నగరి నుంచి ఆర్.కె. రోజా, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.
కాగా సీట్ల కేటాయింపులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 15 మంది మహిళలకు అసెంబ్లీ సీట్లు కేటాయించిన ఆయన... నలుగురికి లోక్‌సభ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 18 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఇందులో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. టీడీపీ 19 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా ఒకరు మాత్రమే గెలుపొందారు.