చంద్రబాబుది ఓట్ల రాజకీయం | YV Subba Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది ఓట్ల రాజకీయం

Published Mon, Jan 14 2019 2:16 PM | Last Updated on Mon, Jan 14 2019 2:16 PM

YV Subba Reddy Slams Chandrababu Naidu - Sakshi

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు సిటీ: ఓట్ల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఇప్పుడు కూడా ఓట్ల రాజకీయానికి తెర లేపారు. ప్రజల సంక్షేమం అంటేనే పట్టించుకోరు. ప్రతి అంశ«ంలోనూ స్వార్థం చూసుకుంటారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంక్రాంతికి వెలుగొండ నుంచి నీరు ఇస్తామన్న చంద్రబాబు ఇక ఇవ్వలేరని అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రానుందని, వెలుగొండను పూర్తి చేసి సాగు, తాగునీటిని అందిస్తామని అన్నారు. జిల్లాలోని గ్రామాల్లో తాగునీటికి కటకటలాడుతున్నా ప్రభుత్వం స్పందిస్తున్న పరిస్థితి లేదన్నారు. 2014 ఎన్నికల్లో వెలుగొండ  తెస్తానని బాబు ఓట్లు వేయించుకొనిజనాన్ని మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు మోసంపై వెలుగొండ సాధన కోసం తాను పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని విస్మరించిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చినందున మళ్లీ మోసపూరితమైన మాటలతో ముందుకు వచ్చారని అన్నారు.

రైతుల్ని ఆదుకొనేది వైఎస్సార్‌సీపీనే..
రైతులకు కనీస మద్దతు ధర లేదని వైవీ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతు కుటుంబాలు సంతోషంగా ఉండే విధానాలను అమలు చేస్తామని అన్నారు. అపరాలు పండించే రైతు కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు. పంట దళారుల వశమైందని తెలిపారు. సుబాబుల్, జామాయిల్‌ రైతులకు న్యాయం జరగలేదన్నారు. జిల్లాకు సాగర్‌ జలాలు వచ్చినప్పుడు వాటిని సక్రమంగా తీసుకురాలేకపోయారని అన్నారు. గిట్టుబాటు ధరలను కల్పించకుండా రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారన్నారు.

సహకార వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు
సహకార వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి సహకార రంగంలోని డెయిరీలను దెబ్బతీశారని అన్నారు. రూ.కోట్లు లూఠీ చేశారని అన్నారు. నిధులు రూ.కోట్ల కొద్దీ స్వాహా చేశారన్నారు. పాడి పరిశ్రమను దెబ్బతీశారని, పాడి రైతు ప్రాణాలను తోడేశారని వివరించారు. డెయిరీలో జరిగిన కుంభకోణాలను వైఎస్సార్‌సీపీ బయటపెడుతుందని అన్నారు. అధికారంలోకి రాగానే విచారణ జరిపించి తెలుగుదేశం నాయకులు చేసిన స్వాహాలను బయటపెడతామని అన్నారు.

ఓట్ల కోసం రాజకీయం: చంద్రబాబు ఓట్ల రాజకీయాలకు తెరలేపారని వైవీ విమర్శించారు. గత ఎన్నికల్లోనూ శంకుస్థాపనలు చేశారని, వాటిలో ఎన్నింటికి నిధులిచ్చి పూర్తి చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు నవరత్నాలను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ పథకాల్లో ఒకటైన రూ.2 వేల పింఛన్‌ను ఇస్తున్నట్లుగా చెప్పారని అన్నారు. నాలుగున్నర ఏళ్ల నుంచి పింఛన్‌ను ఎందుకు పెంచలేకపోయారని ప్రశ్నించారు. ఇçప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఓట్ల రాజకీయానికి పాల్పడ్డారని విమర్శించారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో పొత్తులుండవ్‌: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదని వైవీ స్పష్టం చేశారు. జగన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా విలేకర్ల ప్రశ్నకు జవాబు చెప్పారు. పార్టీని వీడి వెళ్లిన వారు వస్తానంటే తీసుకొనేది లేదన్నారు. పార్టీ నుంచి గెలిచి మోసం చేసి వెళ్లారని, వారిని ప్రజలు విశ్వసించరని అన్నారు. ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జనసేన పద్దతులతో విసిగిపోయారని, వైఎస్సార్‌సీపీకే ఎన్నికల్లో ప్రజలు విజయం చేకూర్చిపెడతారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, కొండపి సమన్వయకర్త డాక్టర్‌ మాదాసి వెంకయ్య, నాయకులు వై.వెంకటేశ్వరరావ, కేవీ రమణారెడ్డి            పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరిలాంటిది
జె.పంగులూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని కల్లంవారి పాలెంలో ఆదివారం వైఎస్సార్‌ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి గరటయ్య నివాసంలో విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశారు. అద్దంకి నుంచి వైవీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారా అని విలేకరులు అడగ్గా..         తమకు అటువంటి ఆలోచన ఏదీ లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న గరటయ్య ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడన్నారు. దానిలో ఏ విధమైన సందేహం లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.  పరిశ్రమలు రావాలన్నా, పన్నురాయితీ కావాలన్నా అది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యం అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement