ఎల్లారెడ్డిపేట : కొత్త మండల కేంద్రంగా ఏర్పాడిన వీర్నపల్లిలో ఇంకా ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతోంది. మండల కేం ద్రం ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని భావించిన మండలవాసుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రతి పనికి గతంలో లాగే ఎల్లారెడ్డిపేటకు వెళ్లక తప్పడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి అన్ని శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. ప్రారంభం నాటి నుంచి కొన్ని కార్యాలయాలు తాళం తీయకుండానే దర్శనమిస్తున్నాయి. ప్రజలకు అతి కీలకమైన పంచాయతీ రాజ్ శాఖకు అధికారులను కేటాయించకపోవడంతో అందుబాటులో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏడు గ్రామాలు.. ముగ్గురు అధికారులు
వీర్నపల్లి మండలంలో అడవిపదిర, రంగంపేట, గర్జనపల్లి, వన్‌పల్లి, మద్దిమల్ల, కంచర్ల, వీర్నపల్లి గ్రామాలన్నాయి. ప్రస్తుతం ఆ మండల పరిధిలో తహసీల్దార్, ఎస్సై, ఐకేపీ ఏపీఎం మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలను విభజించకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్, నీటి పారుదల, విద్య, వైద్యం, వ్యవసాయ శాఖకు ఇన్‌చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
సంక్షేమ పథకాలకు దూరం
ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక.. ఇన్‌చార్జీలు అందుబాటులో ఉండక సంక్షేమ పథకాలకు మండల ప్రజలు దూరమవుతున్నారు. మండలంలో ఏడు గ్రామపంచాయతీలతో పాటు 28గిరిజన తండాలుండగా వీరంతా ప్రతి పనికి ఎల్లారెడ్డిపేటకు రావాల్సి వస్తుండడంతో వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు. వెంటనే అన్ని శాఖలను విభజించి, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం
వీర్నపల్లి మండలంలో అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయం. కేవలం మూడు శాఖల అధి కారులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. కొన్ని శాఖలు ఇప్పటికీ బైఫర్‌గేషన్ కాలేదు. శాఖలను విడదీసి అక్కడ పూర్తిస్థాయి అధికారులను నియమించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.
– చిరంజీవి, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment