new mandals
-
Telangana: రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది. -
తెలంగాణలో కొత్త మండలాలు ఏర్పాటు
-
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు
సాక్షి, హైదరాబాద్: పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగు ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్ల పరిధిల్లో కొత్తగా ఏర్పాటైన మండలాలు : ► నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్, కొత్తపల్లె మండలాలు ► వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ మండలం ► మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల మండలం ► నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ► నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం ► మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..సీరోల్ మండలం ► నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో...గట్టుప్పల్ మండలం ► సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో...నిజాంపేట్ మండలం ► కామారెడ్డి జిల్లాలోని, బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. డోంగ్లీ మండలం ► జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో.. ఎండపల్లి మండలం ► జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో, భీమారం మండలం చదవండి: తెలంగాణకు అతిభారీ వర్షాల హెచ్చరిక -
కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు రాబోతున్నాయి. ఒకప్పుడు 57 మండలాల సువిశాల జిల్లాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ తరువాత నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భవించింది. మరో మూడుజిల్లాల్లోనూ పాత మండలాలు కలిశాయి. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా కరీంనగర్ ఆవిర్భవించింది. చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది. చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్) (పర్లపల్లి లేదా నుస్తులాపూర్ను సైతం పరిశీలిస్తున్నారని సమాచారం) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగిత్యాలలో రాజారాంపల్లి జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి– ఎండపెల్లి గ్రామాలను కలిపి మండలకేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను తాజాగా రెవెన్యూ అధికారులు పంపారు. ఇందుకోసం ధర్మారం మండలంలోని మూడు గ్రామాలను విలీనం చేసేందుకు గతంలోనే గ్రామపంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని, ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కాకతీయ ఉత్సవాలు అద్భుతం!) -
Nizamabad: ఆలూరు, డొంకేశ్వర్ మండలాల ఏర్పాటు అంతేనా..!
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో 2016లో పాలన మరింతగా వికేంద్రీకరించేందుకు కొత్త జిల్లా లు, కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీలను సైతం ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం అత్యంత ఆవశ్యకత ఉన్నప్పటికీ కొత్త మండలాల ఏర్పాటు మాత్రం జరగలేదు. దీంతో వీటిని ఆశిస్తున్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం నుంచి నిజామాబాద్ నగరపాలక సంస్థలో కలిపిన కొన్ని గ్రామాలు, ఆర్మూర్ పురపాలక సంఘం మినహాయించినప్పటికీ, కేవలం మూడు మండలాలైన మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాల్లో కలిపి 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోనే ఎక్కువ పంచాయ తీలు ఉన్న మండలాల్లో మొదటి వరుసలో ఉన్నా యి. ప్రస్తుతం ఆర్మూర్ మండలంలో 18 పంచాయతీలు, నందిపేట మండలంలో 33 పంచాయతీలు, మాక్లూర్ మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని కొన్ని పంచాయతీలను విడదీసి కొత్తగా రెండు మండలాలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భా గంగా నందిపేట మండలం నుంచి కొత్తగా డొంకేశ్వర్ మండలం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 13 పంచాయతీలు నందిపేట మండలం నుంచి కొత్త మండలంలో కలిపేలా నిర్ణయించారు. అదేవిధంగా మరోవైపు ఆర్మూర్ మండలం నుంచి కొత్తగా ఆలూ రు పేరిట మండలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి పాదించారు. ఆలూరు మండలం పరిధిలోని ఆర్మూర్‌లోని కొన్ని పంచాయతీలతో పాటు, నందిపేట మండలం నుంచి వెల్మల్, సిద్ధాపూర్, వన్నెల్(కె) పంచాయతీలను, మాక్లూర్ మండలం నుంచి రాంచంద్రపల్లి, కల్లెడ, గుత్ప పంచాయతీలను కలిపేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రక్రి య పూర్తి చేయడంతో పాటు కొత్త మండలాల కోసం అవసరమైన కార్యాలయాల కోసం భవనాలను సైతం చూసి వాటికి రంగులు వేసి మరీ సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో, అప్పటి కలెక్టర్ యోగితారాణాకు ఉన్న విభేదాల కారణంగా కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియకు ఫుల్స్టాప్ పడినట్లు పలువురు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్త మండలాలను ఆశిస్తున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. డిమాండ్లను పట్టించుకోని సర్కారు ఆర్మూర్ నియోజకవర్గంలో భారీగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో నుంచి కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ అది సాకారం కాలేదు. మరోవైపు జిల్లాలో మూడు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలతో కొన్ని మండలాలు ఏర్పాటు కావ డం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలో ని బాల్కొండ మండలాన్ని మూడు మండలాలుగా విభజించారు. బాల్కొండ, మోప్కాల్, మెండోరా మండలాలు ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ మండలాలు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం నుంచి మొదటగా రుద్రూరు మండలాన్ని విభజించారు. అయితే మండలాల విభజన ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తరువాత కాలంలో కొ త్తగా చందూరు, మోస్రా మండలాలను ఏర్పా టు చేయించారు. దీంతో వర్ని మండలాన్ని నా లుగు మండలాలుగా విభజించినట్లైంది. ఈ నే పథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటు అంశం వెనక్కి వెళ్లడంతో ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. -
ఎన్నాళ్లీ ఇన్చార్జీల పాలన
ఎల్లారెడ్డిపేట : కొత్త మండల కేంద్రంగా ఏర్పాడిన వీర్నపల్లిలో ఇంకా ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. మండల కేం ద్రం ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని భావించిన మండలవాసుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రతి పనికి గతంలో లాగే ఎల్లారెడ్డిపేటకు వెళ్లక తప్పడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి అన్ని శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. ప్రారంభం నాటి నుంచి కొన్ని కార్యాలయాలు తాళం తీయకుండానే దర్శనమిస్తున్నాయి. ప్రజలకు అతి కీలకమైన పంచాయతీ రాజ్ శాఖకు అధికారులను కేటాయించకపోవడంతో అందుబాటులో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడు గ్రామాలు.. ముగ్గురు అధికారులు వీర్నపల్లి మండలంలో అడవిపదిర, రంగంపేట, గర్జనపల్లి, వన్‌పల్లి, మద్దిమల్ల, కంచర్ల, వీర్నపల్లి గ్రామాలన్నాయి. ప్రస్తుతం ఆ మండల పరిధిలో తహసీల్దార్, ఎస్సై, ఐకేపీ ఏపీఎం మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలను విభజించకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్, నీటి పారుదల, విద్య, వైద్యం, వ్యవసాయ శాఖకు ఇన్చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలకు దూరం ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక.. ఇన్చార్జీలు అందుబాటులో ఉండక సంక్షేమ పథకాలకు మండల ప్రజలు దూరమవుతున్నారు. మండలంలో ఏడు గ్రామపంచాయతీలతో పాటు 28గిరిజన తండాలుండగా వీరంతా ప్రతి పనికి ఎల్లారెడ్డిపేటకు రావాల్సి వస్తుండడంతో వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు. వెంటనే అన్ని శాఖలను విభజించి, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వీర్నపల్లి మండలంలో అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయం. కేవలం మూడు శాఖల అధి కారులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. కొన్ని శాఖలు ఇప్పటికీ బైఫర్గేషన్ కాలేదు. శాఖలను విడదీసి అక్కడ పూర్తిస్థాయి అధికారులను నియమించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. – చిరంజీవి, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట -
మండలాల విభజనపై జలీల్‌ఖాన్ అభ్యంతరం
సాక్షి, విజయవాడ : విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం తెలిపారు. తనకు అనుకూలంగా ఉన్న డివిజన్లు తన మండల పరిధిలోనే ఉంచాలంటూ ఆయన అధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే, ఎమ్మెల్యే ప్రతిపాదనను పరిశీలించాక విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే కోరినట్టు మారిస్తే మండలాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జనాభా, డివిజన్ల ఆధారంగా.. విజయవాడ నగరంలో 59 డివిజన్లు, జనాభాను దృష్టిలో పెట్టుకుని అధికారులు నాలుగు మండలాలను రూపొందించారు. నగరంలోని 10.50 లక్షల జనాభా నాలుగు మండలాలకు సమానంగా సరిపోయేలా కొన్ని డివిజన్లను విభజించారు కూడా. ఒక్కో మండల కార్యాలయ పరిధిలో 14 డివిజన్లు ఉండేలా నోటిఫికేషన్ తయారుచేశారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగు.. మూడయ్యే అవకాశం జలీల్‌ఖాన్ కోరినట్టుగా ఉత్తర మండల పరిధిలోని మూడు డివిజన్లు పశ్చిమ మండలంలోకి మారిస్తే పశ్చిమ మండలంలో జనాభా ఎక్కువవుతారు. ఉత్తర మండలంలో జనాభా తగ్గుతారు. కనీసం ఐదారు వేల మంది తగ్గితే ఉత్తర మండలాన్ని తీసివేసి మిగిలిన డివిజన్లను పశ్చిమ, సెంట్రల్, తూర్పు డివిజన్లలో కలిపేయాల్సి ఉంటుంది. ఎక్కువ మండల కార్యాలయాలు ఉంటే ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చు. కార్యాలయం ఆయా డివిజన్ వాసులకు అందుబాటులో ఉంటుంది. అధికారులపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. నాలుగు మండలాలకు బదులుగా మూడు ఏర్పాటుచేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. -
ఆంధ్రలో అర్బన్ మండలాల విభజన
అమరావతి: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని అర్బన్ మండలాలను విభజించి కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు కొత్త మండలాలుగా విభజించింది. అవి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ ఉత్తరం, విజయవాడ మధ్య మండలాలుగా ఉంటాయి. గుంటూరు మండలాన్ని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్‌గా విభజించింది. ఇక కర్నూలు మండలాన్ని విభజించి కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విశాఖ అర్బన్, రూరల్ మండలాలను ఐదు కొత్త మండలాలుగా విభజించింది. -
ఏపీలో హిజ్రాలకు ఇక రూ.1500 పెన్షన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటుచేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీని ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు. అలాగే, 2014 పోలీస్ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. -
కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన మండలాలకు మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులను మంజూరు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కొత్త మండలాలకి ఒక పోస్టును సృష్టించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని గ్రామాలు పక్క మండలాలకు, పక్క జిల్లాలకు వెళ్లిపోవడంతో 125 వరకు కొత్త మండలాల్లో ఎంఈవో పోస్టులు అవసరమయ్యాయి. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే సర్వీసు రూల్స్ సమస్య ఉన్న కారణంగా వాటిని రెగ్యులర్‌గా భర్తీ చేసే అవకాశం లేనందునా, ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా ఆయా మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు చెందిన సీనియర్ హెడ్ మాస్టర్లకు బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటీ రెండు రోజుల్లో వె లువడే అవకాశం ఉంది. -
నేడు కీలక భేటీ
సాక్షిప్రతినిధి నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీకానుంది. ఇందులో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. ఇదివరకే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి పలు అంశాలను జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. కొత్త మండలాల ఏర్పాటు, ప్రాంతాలు, అధికారులు, ఉద్యోగుల విభజన తదితర విషయాలను చర్చించనున్నారు. ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా నివేదికపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్దగా ఎదురయ్యే ఆటంకాలు లేవని చెప్పుకోవాలి.అయితే మండలాల ఏర్పాటు ప్రాంతాల విభజనకు సంబంధించి కొన్ని వినతులను, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని చర్చించనున్నారు. జిల్లాలో కొత్తగా 10 మండలాలు పెరుగనున్నాయి. కొత్త మండలాల విలీనంపై స్పష్టత వచ్చింది. 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని నాగిరెడ్డిపేట మండలంను మెదక్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కొత్తగా కామారెడ్డిలో మరో మండలం ఏర్పాట్లు అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా బాన్సువాడ నియోజక వర్గ పరిధిలోని కోటగిరి, వర్ని మండలాలు నిజామాబాద్ జిల్లాలో కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించే అవకాశం ఉంది. ఇదివరకే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ రెండు మండలాలను నిజామాబాద్ జిల్లాలో కలుపనున్నట్లు హామీ ఇచ్చారు. అయినా మంత్రి వర్గ ఉపసంఘం కీలక సమావేశం కాబట్టి ఇందులోనే ఈ రెండు మండలాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం మేరకు రెండు జిల్లాల్లో మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉంటాయోనని ఈ సమావేశంలో తేలనున్నది. కొన్ని రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఏర్పాటుపై సందేహాలకు సైతం ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని అంశాలు.. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఉద్యోగుల విభజన, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక ఏర్పాట్లు, జోనల్ శాఖల పునర్వ్యవస్థీకరణ పై ఈ కమిటీ చర్చించనుంది. ముసాయిదాకు ముందే దీనిపై తుది నిర్ణయం తీసుకొని నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో పునర్విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికలను మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలించనుంది. అలాగే మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీసు శాఖకు సంబంధించి అభిప్రాయాలను పరిశీలించనున్నారు. ఇదివరకే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, పరిపాలనకు సంబంధించి భవనాల పరిశీలన చేశారు. కార్యాలయాలకు భవనాలను కూడా ఎంపికచేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థ పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించి అన్ని వివరాలను ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేయనుంది. అలాగే కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ అర్బన్, రూరల్‌లో రుద్రుర్, కామారెడ్డి అర్బన్‌లో తోడు ఆలూరు, భిక్కనూరు మండలం రాజాంపేట, దోమకొండ మండలం బీబీపేటలు మండలాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి కొత్త మండలం ఏర్పాటుపై పరిశీలించనున్నారు. జనాభా ప్రతిపాదికన కూడా విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 22న ముసాయిదాలో తుది నిర్ణయం తీసుకొని నివేదిక పొందుపరచనున్నారు. అందుకుగాను నేడు కీలక సమావేశం జరుగనుంది. జిల్లా కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్ సైతం ఈ సమావేశంలో పాల్గొని నివేదికలు ఇవ్వనున్నారు. నేడు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పునర్విభజన సందేహాలకు బ్రేక్‌పడనుంది. మంత్రి వర్గ ఉపసంఘం నిజామాబాద్‌లోని కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దీంతో దసరా నుండి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. -
కొత్త మండలాలపైనే ఫోకస్
కలెక్టర్ల సదస్సులో తొలిరోజు వీటిపైనే చర్చ కొత్త జిల్లాలకు పరిధి ఖరారు.. చుట్టూ 65-70 కి.మీ. మించకుండా జిల్లాల పునర్విభజన జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా హద్దుల గుర్తింపు మ్యాప్‌లు, ముసాయిదాలను ప్రజెంట్ చేసిన కలెక్టర్లు నేడు ముఖ్యమంత్రి, సీఎస్ ఆధ్వర్యంలో తుది కసరత్తు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 23 లేదా 24 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు తుది కసరత్తు చేసింది. ఒక్కో జిల్లా కేంద్రం నుంచి ఆ జిల్లా పరిధి 65-70 కిలోమీటర్ల దూరం మించకుండా ఉండేలా పునర్విభజన జరగాలని దిశానిర్దేశం చేసింది. అదే ప్రధాన గీటురాయిగా ఏయే మండలాలను ఎందులో కలపాలన్న ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు సైతం జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుందని, అన్ని మండలాలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని నిర్దేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనను సైతం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన రెండ్రోజుల వర్క్‌షాప్ మంగళవారం ఉదయం ఎంసీహెచ్ఆర్డీలో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా తొలిరోజు సదస్సును ప్రారంభించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితర అధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం తిరిగి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాయంత్రం సదస్సుకు హాజరయ్యారు. ఇప్పటికే నిర్దేశించిన విధివిధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు సమర్పించిన కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాల ప్రతిపాదనలపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగింది. జిల్లాల వారీగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తమ ప్రతిపాదనలు, మ్యాప్‌లతో సహా కలెక్టర్లు విశ్లేషించారు. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏయే మండలాలు ఏయే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలి.. జిల్లా సరిహద్దులు ఎలా ఉండాలి.. ఏయే మండలాలను ఏ జిల్లాలో చేరిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న వివరాలను ప్రదర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధితోపాటు అందులో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, మండలాల హద్దులపై సమగ్ర నివేదికలు సమర్పించారు. తొలిరోజు సదస్సులో కొత్త రెవెన్యూ మండలాల ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. జనాభా, మండల పరిధి, భౌగోళిక స్వరూపం, రవాణా సదుపాయాలను బట్టి కొత్త మండలాల కసరత్తు జరగాలని నిర్ణయం తీసుకున్నారు. జనాభా, వైశాల్యం, పట్టణాలకు ఆనుకొని ఉన్న మేజర్ గ్రామాలు.. వీటన్నింటిని పరిశీలించి రాష్ట్రంలో దాదాపు 70-80 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నట్లు కలెక్టర్లు ఇచ్చిన నివేదికలతో లెక్క తేలింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మండలాలకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పెద్ద పట్టణాల్లో అర్బన్, రూరల్ మండలాల ప్రతిపాదనలు అన్ని జిల్లాల నుంచి అందాయి. మండల కేంద్రానికి గ్రామాల దూరం ఎక్కువగా ఉండకుండా నిర్ణీత పరిధి ఉండేలా చూడాలని సీసీఎల్ఏ.. కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా భూపరిపాలన, రెవెన్యూ అధికారులు ముందే రూపొందించిన ప్రశ్నావళిని కలెక్టర్లకు అందజేశారు. వాటికి సంబంధించి అధికారులు రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా తమ జిల్లాల సరిహద్దులో ఉండి.. ఇతర జిల్లాల్లో విలీనమయ్యే గ్రామాలు, రెవెన్యూ సరిహద్దులను ఎలా సవరించాలనే అంశంపై వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా మండలాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల పరిధి, అధికార వికేంద్రీకరణతో పాటు కావాల్సిన సిబ్బంది, అధికారుల సంఖ్యతో కూడిన వివరాలను సైతం అందించారు. జీఐఎస్ మ్యాపింగ్‌తో కసరత్తు భూపరిపాలన విభాగం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మండలాలు, కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్(జీఐఎస్) ద్వారా శాస్త్రీయంగా కసరత్తు చేసింది. దీంతో ఏ కేంద్రం నుంచైనా 65-70 కిలోమీటర్ల పరిధిలో చుట్టూరా సరిహద్దు గీయటం.. ఆ పరిధిలో ఏయే ప్రాంతాలున్నాయి? ఎంత జనాభా ఉంది? ఏయే మండలాలు ఆ పరిధిలో ఉన్నాయి? సరిహద్దుల్లో ఉన్న మండలాలను ఎందులో కలపాలనేది అప్పటికప్పుడే చూపించింది. కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను తమ దగ్గరున్న జీఐఎస్ మ్యాపింగ్‌తో చేసిన నమూనా మ్యాప్‌లను సరిపోల్చి సలహాలు సూచనలు చేసింది. నదులు, వాగులు, వంకలున్న చోట జీఐఎస్ మ్యాపింగ్‌కు, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులకు తేడాలుంటాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా వస్తున్న డిమాండ్లను సీఎంకే వదిలేయాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నారు. జిల్లాలకు సంబంధించిన మరింత స్పష్టతను ఇచ్చేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు సీఎస్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు.